Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మీసిల్స్, రూబెల్లా ప్రత్యేక టీకా డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య

    Author RAJANEETHI | 17 Jul 2026, 12:49 PM | ANDHRA PRADESH
    మీసిల్స్, రూబెల్లా ప్రత్యేక టీకా డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య

    మదనపల్లి, జూలై 17 (రాజనీతి): మీసిల్స్, రూబెల్లా (పొంగు, మూడు రోజుల తట్టు) వ్యాధుల నిర్మూలన లక్ష్యంగా ఈ నెల 20 నుంచి 27 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఎంఆర్ టీకా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య తెలిపారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా టీకాల అధికారి డాక్టర్ ఉషశ్రీతో కలిసి ఆయన మాట్లాడారు. భారత ప్రభుత్వం 2026 డిసెంబర్ నాటికి మీసిల్స్, రూబెల్లా వ్యాధులను దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందులో భాగంగా మూడు విడతల్లో ప్రత్యేక టీకా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తొలి విడత విజయవంతంగా పూర్తైందని, రెండో విడత జూలై 20 నుంచి 27 వరకు, మూడో విడత అక్టోబర్ 12 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. మీసిల్స్, రూబెల్లా ప్రమాదకర వైరస్ వ్యాధులని, ఇవి పిల్లల్లో న్యూమోనియా, డయేరియా, మెదడు ఇన్‌ఫెక్షన్లకు దారి తీసి ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉందన్నారు. గర్భిణులకు సోకితే మృత శిశువులు లేదా పుట్టుకతో లోపాలున్న శిశువులు జన్మించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. 9 నుంచి 12 నెలల మధ్య మొదటి డోస్, 16 నుంచి 24 నెలల మధ్య రెండో డోస్ ఎంఆర్ టీకా వేయించని ఐదేళ్లలోపు పిల్లలను ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి గుర్తించి టీకాలు వేయనున్నట్లు తెలిపారు. వలస కార్మికులు, మురికివాడలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, మత్స్యకారులు, వ్యవసాయ కూలీల పిల్లలకు ప్రత్యేకంగా టీకాలు అందజేస్తామని చెప్పారు. టీకాలపై అపోహలు విడనాడి ప్రతి అర్హత కలిగిన చిన్నారికి ఎంఆర్ టీకా వేయించి జిల్లాను మీసిల్స్, రూబెల్లా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని డీఎంహెచ్‌ఓ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి, మహమ్మద్ రఫీ, రాజగోపాల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి