Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పేద విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్స్ పంపిణీ

    Author RAJANEETHI | 27 Jun 2026, 06:12 PM | ANDHRA PRADESH
    పేద విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్స్ పంపిణీ

    విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజంలో ఆదర్శప్రాయులుగా నిలవాలంటే చదువే ప్రధాన ఆయుధమని రేణిగుంట మండల విద్యాశాఖ అధికారి రంగనాథ్ అన్నారు. విద్యతో పాటు మంచి సంస్కారం, క్రమశిక్షణ, మానవీయ విలువలను అలవర్చుకున్నప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని ఆర్‌సీఎం యూపీ పాఠశాలలో శనివారం షమ్దా సానీ ఫౌండేషన్ (హాంకాంగ్) సహకారంతో చేయూత సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి రంగనాథ్ విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పాఠ్య సామగ్రిని పంపిణీ చేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన జీవిత లక్ష్యాన్ని చిన్నప్పటి నుంచే నిర్దేశించుకుని దానిని సాధించేందుకు కష్టపడి చదవాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. పాఠశాలలో పుస్తక పాఠాలు మాత్రమే కాకుండా జీవితానికి అవసరమైన నైతిక విలువలు, క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం, సమాజం పట్ల బాధ్యత వంటి అంశాలను కూడా ఉపాధ్యాయులు బోధిస్తారని తెలిపారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. చేయూత సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు ప్రత్యూష మాట్లాడుతూ తన తండ్రి జూలియన్ రాజు ఎన్నో సంవత్సరాలుగా పేద విద్యార్థులకు, నిరుపేద కుటుంబాలకు వివిధ రూపాల్లో సేవలు అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఆయన సేవా భావం తనకు స్ఫూర్తిగా నిలిచిందని, అదే స్ఫూర్తితో ప్రతి ఏడాది పేద విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవడమే తమ సేవా కార్యక్రమాల అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత తాము చదివిన పాఠశాలలను, పేద విద్యార్థులను మరచిపోకుండా తమ వంతు సహాయం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ రోజు మీరు సహాయం పొందుతున్నవారు... రేపు సహాయం చేసే స్థాయికి ఎదగాలి. అదే సమాజానికి నిజమైన సేవ అని ఆమె పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని పీ.జె. మేరీ ఏంజెల్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేయూత సోషల్ సర్వీస్ సొసైటీ, షమ్దా సానీ ఫౌండేషన్ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా విద్యాభ్యాసంపై మరింత ఆసక్తిని కలిగిస్తాయని అన్నారు.
    స్టడీ మెటీరియల్స్ అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ, బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తామని, భవిష్యత్తులో తాము కూడా పేద విద్యార్థులకు సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని పీ.జె. మేరీ ఏంజెల్, ఉపాధ్యాయులు, చేయూత సోషల్ సర్వీస్ సొసైటీ సభ్యులు, షమ్దా సానీ ఫౌండేషన్ ప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    పేద విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్స్ పంపిణీ - Additional Image