Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పల్స్ పోలియో, స్టాప్ డయేరియా కార్యక్రమాలను విజయవంతం చేద్దాం: వైద్యాధికారులు

    Author RAJANEETHI | 16 Jun 2026, 07:55 PM | ANDHRA PRADESH
    పల్స్ పోలియో, స్టాప్ డయేరియా కార్యక్రమాలను విజయవంతం చేద్దాం: వైద్యాధికారులు

    వాయల్పాడు (రాజనీతి): ఈనెల 28వ తేదీ ఆదివారం నిర్వహించబోయే ఐపీపీఐ (ఉధృత పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం) మరియు జూన్ 16 నుండి జూలై 31 వరకు జరిగే 'స్టాప్ డయేరియా' (అతిసార నియంత్రణ) కార్యక్రమాలను విజయవంతం చేయాలని చింతపర్తి ఇంచార్జి వైద్యాధికారి డాక్టర్ ఆశిక్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పీహెచ్‌సీలో ఈ రెండు కార్యక్రమాలపై ఆశా, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, ఎమ్మెల్హెచ్‌పీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూన్ 28న ఆదివారం రోజున అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుండి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ నిర్దేశించిన బూత్‌లలో తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. గతంలో వేయించినప్పటికీ ఇది అదనపు డోస్ అని గుర్తుచేశారు. ఆదివారం బూత్‌లలో చుక్కలు వేయించుకోని పిల్లల కోసం సోమ, మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అదేవిధంగా ఐదేళ్ల లోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణమైన అతిసార వ్యాధి (డయేరియా) అరికట్టడమే 'స్టాప్ డయేరియా' కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ పథకంలో భాగంగా ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఐదేళ్ల లోపు పిల్లలున్న ప్రతి ఇంటికి రెండు ఓఆర్‌ఎస్ (ORS) ప్యాకెట్లు అందిస్తారని వివరించారు. ఎవరికైనా నీళ్ల విరోచనాలు అవుతుంటే ఓఆర్‌ఎస్‌తో పాటు జింక్ మాత్రలు ఇచ్చి 14 రోజుల పాటు ఉచితంగా చికిత్స అందిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల శుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. అనంతరం ఈ అంశాలపై అవగాహన ర్యాలీ నిర్వహించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ అరుణ, పర్యవేక్షకులు బహుద్దీన్, భానుబి, భానులక్ష్మి, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.