Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోలీసుల చొరవతో బాలుడి క్షేమంగా ఇంటికి చేరిక

    Author RAJANEETHI | 29 Aug 2026, 11:24 AM | ANDHRA PRADESH
    పోలీసుల చొరవతో బాలుడి క్షేమంగా ఇంటికి చేరిక

    రేణిగుంట, ఆగస్టు 29 (రాజనీతి): తల్లిదండ్రులు చదువుపై మందలించడంతో అలిగి ఇంటి నుంచి బయటకు వచ్చిన పదేళ్ల బాలుడు పోలీసుల చొరవతో క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. బాలుడు ఒంటరిగా రోడ్డుపై తిరుగుతుండటాన్ని గమనించిన ఓ ఆటో డ్రైవర్‌ మానవతా దృక్పథంతో స్పందించి పోలీసులకు అప్పగించడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన తొలగింది. తిరుపతి నగరానికి చెందిన ధనుష్‌ (10) జీవకోనలోని శ్రీ సదీశ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. చదువులో సరిగా శ్రద్ధ చూపడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో బాలుడు మంగళం రోడ్డువైపు చేరుకున్నాడు. మంగళం రోడ్డులో బాలుడు ఒంటరిగా తిరుగుతుండటాన్ని తారకరామనగర్‌కు చెందిన రామచంద్ర అనే ఆటో డ్రైవర్‌ గమనించాడు. బాలుడి పరిస్థితిని చూసి ఆరా తీయగా, అతను ఇంటి నుంచి వచ్చినట్లు గుర్తించాడు. బాలుడిని ఒంటరిగా వదిలేయకుండా వెంటనే రేణిగుంట పోలీసులను సంప్రదించి వారి వద్దకు తీసుకెళ్లాడు. పోలీసులు బాలుడి వివరాలను తెలుసుకుని అతని తల్లిదండ్రులైన ఎనుగుల శ్రీనివాసులు, రెడ్డెమ్మలకు సమాచారం అందించారు. అదే సమయంలో బాలుడు చదువుతున్న పాఠశాల యాజమాన్యానికి కూడా విషయం తెలియజేశారు. అనంతరం అవసరమైన వివరాలను నిర్ధారించుకుని బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. చాలా సమయం గడవకముందే బాలుడు క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తమ కుమారుడిని సురక్షితంగా అప్పగించడంలో చొరవ చూపిన రేణిగుంట పోలీసులకు, బాలుడిని గుర్తించి పోలీసుల వద్దకు తీసుకువచ్చిన ఆటో డ్రైవర్‌ రామచంద్రకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడుతూ చిన్నారులను ఏదైనా విషయంలో మందలించే సమయంలో వారి మనస్తత్వాన్ని కూడా తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకోవాలని, పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. చిన్న వయస్సులో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లలపై నిరంతరం దృష్టి ఉంచడం అవసరమని పేర్కొన్నారు. బాలుడు ఒంటరిగా కనిపించగానే స్పందించి పోలీసులకు అప్పగించిన రామచంద్ర మానవతా దృక్పథాన్ని సీఐ అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల బాలుడు సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందన్నారు.