Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గంజాయి నిర్మూలనే లక్ష్యం.. యువతను మత్తు నుంచి బయటపడేయడమే ధ్యేయం

    Author RAJANEETHI | 29 Aug 2026, 09:50 AM | ANDHRA PRADESH
    గంజాయి నిర్మూలనే లక్ష్యం.. యువతను మత్తు నుంచి బయటపడేయడమే ధ్యేయం

    రేణిగుంట, ఆగస్టు 29 (రాజనీతి): యువతను గంజాయి, మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడడంతో పాటు గంజాయి సరఫరా మూలాలను గుర్తించి నిర్మూలించేందుకు రేణిగుంట సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట సబ్‌ డివిజన్‌ పరిధిలో వారానికి రెండు నుంచి మూడు రోజులపాటు ప్రత్యేకంగా గంజాయి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలో శనివారం రేణిగుంట మండలం తారకరామనగర్‌లో ఆధునిక పరీక్షా కిట్లతో గంజాయి పరీక్షలు నిర్వహించారు. పోలీసులు అనుమానితులను పరీక్షించి గంజాయి వినియోగానికి సంబంధించిన వివరాలను సేకరించారు. గంజాయి వినియోగాన్ని అరికట్టడంతో పాటు దాని వెనుక ఉన్న సరఫరా వ్యవస్థను గుర్తించడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సూచనలతో సబ్‌ డివిజన్‌ పరిధిలో నిరంతరంగా గంజాయి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
    కేవలం గంజాయి తాగే వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవడం మాత్రమే పోలీసుల ఉద్దేశం కాదన్నారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎవరెవరికి చేరుతోంది.. అనే అంశాలపై సమాచారం సేకరించి సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గంజాయికి అలవాటు పడిన యువతను గుర్తించి వారి జీవితాలను నాశనం కాకుండా కాపాడేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వెనుక ఉన్న కారణాలను తెలుసుకుని, అవసరమైన వారికి కుటుంబ సభ్యుల సహకారంతో కౌన్సెలింగ్‌ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గంజాయి వినియోగానికి అలవాటుపడిన వారిని నేరస్తులుగా చూడకుండా, వారిని ఆ అలవాటు నుంచి బయటకు తీసుకురావడంపైనా దృష్టి సారిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. రుయా ఆస్పత్రి, రాస్‌ సంస్థ తదితర సంస్థల ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న కౌన్సెలింగ్‌ కేంద్రాల ద్వారా అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించి, గంజాయి అలవాటును విడిచిపెట్టి సాధారణ జీవితం గడిపేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఒక వ్యక్తి మాదకద్రవ్యాల నుంచి బయటపడితే అతనితో పాటు మొత్తం కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. యువతలో ఎవరైనా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు తెలిసినా..పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ శ్రీనివాసరావు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర, ఎస్సై శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.