Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రోడ్లు బాగు చేసేంత వరకు దీక్ష విరమించను

    Author RAJANEETHI | 22 Jul 2026, 01:24 PM | ANDHRA PRADESH
    రోడ్లు బాగు చేసేంత వరకు దీక్ష విరమించను

    పుంగనూరు, జూలై 22 (రాజనీతి): అభివృద్ధికి నాంది కావాల్సిన రహదారులు ప్రస్తుతం ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, వాటి మరమ్మతుల కోసం ఓ సామాజికవేత్త ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పుంగనూరు పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త పి. అయూబ్ ఖాన్ సోమవారం పుంగనూరు–బెంగళూరు ప్రధాన రహదారి దుస్థితిని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రహదారి మరమ్మతు పనులు ప్రారంభించే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పుంగనూరు–బెంగళూరు ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రయాణికులకు నరకయాతనగా మారిందన్నారు. రోడ్డంతా గుంతలమయంగా మారడంతో ప్రతి రోజు చిన్నా పెద్దా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ రహదారిపై ప్రయాణం అంటే ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, బస్సులు, లారీలు ప్రతి రోజు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. వర్షం కురిస్తే గుంతలు కనిపించక ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయని అయూబ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఎన్నోసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వినతిపత్రాలు సమర్పించినా, ప్రజాప్రతినిధులను కలిసినా ఎలాంటి ఫలితం లేకపోయిందన్నారు. గతంలో స్థానిక ప్రజలు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టినా అధికార యంత్రాంగం నుంచి శాశ్వత పరిష్కారం రాలేదని విమర్శించారు. పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ బోయకొండ గంగమ్మ దేవస్థానంకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వాహనాల్లో వస్తుంటారని గుర్తు చేశారు. ఈ ప్రధాన రహదారి దెబ్బతినడంతో భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జిల్లాకు చెడ్డపేరు వస్తోందని అన్నారు. వ్యాపార, వ్యవసాయ, రవాణా పరంగా కూడా ఈ రహదారి అత్యంత కీలకమని పేర్కొంటూ, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంలో ఇబ్బందులు పడుతున్నారని, రవాణా వ్యయం కూడా పెరుగుతోందని తెలిపారు. దెబ్బతిన్న రహదారుల కారణంగా అత్యవసర వైద్య సేవలకు వెళ్లే అంబులెన్సులు కూడా ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసం చేస్తున్న దీక్ష కాదని, వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, భక్తులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రజా ఉద్యమం అన్నారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని అయూబ్ ఖాన్ స్పష్టం చేశారు. ఆయన చేపట్టిన దీక్షకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వ్యాపారులు, స్థానిక యువకులు, సామాజిక కార్యకర్తలు సంఘీభావం ప్రకటించారు. వెంటనే రహదారి మరమ్మతు పనులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన పలువురు స్థానికులు మాట్లాడుతూ రహదారి సమస్య ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకపోవడం దురదృష్టకరమని, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారి పునర్నిర్మాణ పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

    అత్యధికంగా చదివినవి