Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కట్టమంచి, గంగినేని చెరువుల సుందరీకరణ వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్...

    Author RAJANEETHI | 20 Jul 2026, 04:29 PM | ANDHRA PRADESH
    కట్టమంచి, గంగినేని చెరువుల సుందరీకరణ వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్...

    ఫుడ్ కోర్టులు, ఓపెన్ జిమ్‌లతో చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే యోచన...


    అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష.. మురుగునీరు చెరువుల్లోకి రాకుండా చర్యలకు ఆదేశం...

    ఇవి కూడా చదవండి

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువు గంగినేని చెరువులను ఆధునిక సౌకర్యాలతో సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి రెండు చెరువులను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.ముందుగా కట్టమంచి చెరువును సందర్శించిన ఎమ్మెల్యే చెరువు కట్టపై ప్రజలు సేదతీరేలా ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. కట్టపై రెండు వరుసలుగా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. నగర ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేసేందుకు అనువుగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, చెరువు కట్టకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరచి పచ్చదనం పెంపొందించే చర్యలు తీసుకోవాలని సూచించారు. నడక మార్గాలు, విశ్రాంతి కోసం కూర్చునే బెంచీలు, విద్యుత్ దీపాలు, అందమైన ల్యాండ్‌స్కేపింగ్ వంటి అంశాలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అనంతరం గంగినేని చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా నగరంలోని మురుగునీరు చెరువులోకి చేరకుండా ప్రత్యేక కాలువల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. చెరువు నీటి నాణ్యతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి గడిపేలా మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. గంగినేని చెరువు కట్టపై కూడా ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు తగిన ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను పరిశీలించి అవసరమైతే మరిన్ని వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నగరానికి వచ్చే సందర్శకులను ఆకర్షించే విధంగా రెండు చెరువుల అభివృద్ధిని చేపట్టాలని పర్యాటక దృక్కోణంలో ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. చిత్తూరు నగర అభివృద్ధిలో చెరువుల సుందరీకరణకు కీలక స్థానం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చెరువులను కేవలం నీటి వనరులుగానే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే వినోద,విహార కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పనుల్లో నాణ్యతకు ఎలాంటి రాజీ లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అధికారులు చేపట్టాల్సిన పనులపై ఎమ్మెల్యే పలు సూచనలు చేస్తూ, ప్రతి దశలో సమన్వయంతో పనిచేసి చిత్తూరు నగరానికి ఆదర్శప్రాయమైన చెరువు అభివృద్ధి నమూనాను రూపొందించాలని ఆకాంక్షించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, టౌన్ ప్లానింగ్ అధికారి నాగేంద్ర, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ నాయక్, ఇరిగేషన్ శాఖ అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి