Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఒక్కసారి గంజాయికి బానిసైతే... భవిష్యత్తే బందీ అవుతుంది..... డీఎస్పీ శ్రీనివాసరావు

    Author RAJANEETHI | 19 Jul 2026, 11:20 AM | ANDHRA PRADESH
    ఒక్కసారి గంజాయికి బానిసైతే... భవిష్యత్తే బందీ అవుతుంది..... డీఎస్పీ శ్రీనివాసరావు

    రేణిగుంట, జూలై 19 (రాజనీతి): నేటి యువతే రేపటి భారతదేశానికి శక్తి. అలాంటి యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసైతే అది ఒక వ్యక్తి జీవితానికే కాదని, కుటుంబానికి, సమాజానికి, దేశ భవిష్యత్తుకే ముప్పుగా మారుతుందని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు, అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు మార్గదర్శకత్వంలో రేణిగుంట సబ్‌డివిజన్ పరిధిలో డ్రగ్స్‌పై దండయాత్ర–2.0 కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం గాజులమాండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకపురం గ్రామ సమీపంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులకు ఆధునిక బయోచెక్ టెస్టింగ్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రగ్స్‌పై దండయాత్ర ఒకరోజు కార్యక్రమం కాదని, ఇది యువతను రక్షించే సామాజిక ఉద్యమం అన్నారు. గంజాయి విక్రయాలు, రవాణా, నిల్వలు, వినియోగం, ప్రతి అంశంపైనా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం అని తెలిపారు. గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా నమోదైన వ్యక్తులు, పెడ్లర్లు, వినియోగదారులందరిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. గంజాయి వినియోగాన్ని ఇకపై అనుమానాలతో కాకుండా శాస్త్రీయ ఆధారాలతో నిర్ధారిస్తున్నాం అన్నారు. బయోచెక్ టెస్టింగ్ కిట్ల ద్వారా గంజాయి వినియోగదారులను గుర్తించి, వారి ద్వారా మొత్తం సరఫరా వ్యవస్థను వెలికితీస్తున్నామని తెలిపారు. ఒక వినియోగదారుడి దగ్గరితో విచారణ ఆగదని. అతనికి గంజాయి ఎవరు అందించారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు రవాణా చేశారు? ఎవరు డబ్బు సంపాదిస్తున్నారు? అనే ప్రతి లింకును గుర్తించి చివరకు ప్రధాన నిర్వాహకుల వరకు చేరుకుంటాం అన్నారు. గంజాయి నెట్‌వర్క్‌ను మూలాలతో సహా నిర్మూలించడమే మా లక్ష్యం అని వివరించారు. వ్యసనానికి గురైన ప్రతి యువకుడిలో ఒక మంచి భవిష్యత్తు దాగి ఉంటుందన్నారు. అందుకే వారిని శిక్షించడం కంటే ముందుగా మారే అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని, అవసరమైతే పాపానాయుడుపేటలోని రాస్ పునరావాస కేంద్రం, స్విమ్స్, రుయా ఆసుపత్రుల డీ-అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నాం అన్నారు. ఒక యువకుడిని వ్యసనం నుంచి బయటపడేస్తే ఒక కుటుంబాన్ని కాపాడినట్లే అని చెప్పారు. మొదట స్నేహితుల ఒత్తిడితో, సరదాగా మొదలయ్యే గంజాయి అలవాటు చివరకు జీవితాన్నే నాశనం చేస్తుందన్నారు. చదువుపై ఆసక్తి తగ్గుతుందని, తల్లిదండ్రులకు దూరమవుతారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. డబ్బు కోసం నేరాల వైపు అడుగులు వేస్తారని, అందుకే యువత ఒక్కసారి ఆలోచించాలని, కొద్దిసేపటి మత్తు కోసం జీవితాంతం బాధపడకండి అని సూచించారు. పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఇంటికి ఆలస్యంగా రావడం, కొత్త స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం, డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడం, చదువుపై ఆసక్తి తగ్గడం, కుటుంబ సభ్యులతో దూరంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని తెలిపారు. ప్రేమతో మాట్లాడి, అవసరమైతే పోలీసులను సంప్రదించాలన్నారు. మీ పిల్లలను కాపాడేందుకు మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాం అని డీఎస్పీ అన్నారు. మీ పరిసరాల్లో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, రవాణా, నిల్వలు, వినియోగం జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు పూర్తిగా గోప్యంగా ఉంచుతాం అన్నారు. మీ ఒక్క సమాచారం ఒక యువకుడి జీవితాన్ని, ఒక కుటుంబ భవిష్యత్తును కాపాడగలదని పేర్కొన్నారు. యువత చేతుల్లో గంజాయి కాదు... పుస్తకం ఉండాలి. మీ మనసులో మత్తు కాదు... లక్ష్యం ఉండాలి. మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవాలి గానీ మత్తు పదార్థాలకు బానిసై నాశనం చేసుకోవద్దు. తల్లిదండ్రుల ఆశలను, గురువుల నమ్మకాన్ని, మీ భవిష్యత్తును వమ్ము చేయకండి. గంజాయికి 'నో' చెప్పండి... జీవితానికి 'యెస్' చెప్పండి అని యువతకు పిలుపునిచ్చారు. గంజాయి రహిత తిరుపతి జిల్లా నిర్మాణమే మా సంకల్పం అని, పోలీసులు మాత్రమే ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించలేరని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యువత, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి పౌరుడు కలిసి పనిచేసినప్పుడే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. డ్రగ్స్‌పై మా పోరాటం ఆగదని ,యువత భవిష్యత్తు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఈ యుద్ధం మరింత ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గాజులమాండ్యం సీఐ మంజునాథ్ రెడ్డి, ఎస్‌ఐ హరీష, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

    ఒక్కసారి గంజాయికి బానిసైతే... భవిష్యత్తే బందీ అవుతుంది..... డీఎస్పీ శ్రీనివాసరావు - Additional Image
    అత్యధికంగా చదివినవి