Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి – సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలి

    దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి – సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలి

    పార్లమెంట్‌లో చట్ట సవరణకు ప్రధాని మోదీని ఒప్పించాలి: ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు
    చీరాల: ఈ రోజు చీరాల బీచ్ రిసార్ట్‌లో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా అంశంపై ఆంద్ర ప్రదేశ్ క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రైస్తవుల నాయకులు మేధావుల సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు పాల్గొని ప్రసంగించారు
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ హోదా కల్పించడం సామాజిక న్యాయం సాధనలో అత్యవసరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై వెంటనే ఒత్తిడి తీసుకువచ్చి, పార్లమెంట్‌లో అవసరమైన చట్ట సవరణ జరిగేలా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించాలని డిమాండ్ చేశారు.
    దళిత క్రైస్తవుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ కీలక అంశంపై ఎందుకు మౌనం వహిస్తోందో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి కేవలం ఎన్నికల హామీలకే పరిమితమా అని నిలదీశారు. దళిత క్రైస్తవుల హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు.
    మతం మారినా కులం మారదని 2007లో రంగనాథ్ మిశ్రా కమిషన్ స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ సిఫార్సులను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. పాత నివేదికను పక్కన పెట్టి ఇప్పుడు బాలకృష్ణన్ కమిషన్ పేరుతో మరోసారి కాలయాపన చేయడం దళిత క్రైస్తవులను మోసం చేయడమేనని అన్నారు.
    కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని, బాలకృష్ణన్ కమిషన్ నివేదికపై ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణమే సుప్రీంకోర్టుకు సమర్పించి, రాజ్యాంగ విరుద్ధంగా కొనసాగుతున్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా–3ను పార్లమెంట్‌లో చట్ట సవరణ ద్వారా తొలగించాలని డిమాండ్ చేశారు.
    1936లో బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను స్వాతంత్ర్యం తర్వాత 1950 రాష్ట్రపతి ఉత్తర్వులో యథాతథంగా కొనసాగించడం దళిత క్రైస్తవులకు చారిత్రక అన్యాయం చేశిందన్నారు. ఆర్టికల్ 341(2) ప్రకారం 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించిన ప్రభుత్వాలు, అదే న్యాయాన్ని దళిత క్రైస్తవులకు వర్తింపజేయకుండా వివక్ష చూపుతున్నాయని విమర్శించారు.
    ఈ సందర్భంగా గత ప్రభుత్వాల పాత్రను ప్రస్తావిస్తూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి, అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
    అయితే ప్రస్తుతం కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నందున, గతంలో తీర్మానం చేసినంత మాత్రాన సరిపోదని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నేరుగా చర్చించి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై బలమైన ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై తన స్పష్టమైన వైఖరిని ప్రకటించి, పార్లమెంట్‌లో చట్ట సవరణ జరిగే వరకు నిరంతరం కేంద్రంతో చర్చలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
    సమాజంలో అంటరానితనం, సామాజిక బహిష్కరణ వివక్షను ఇప్పటికీ ఎదుర్కొంటున్న దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని విడనాడి, పార్లమెంట్‌లో చట్ట సవరణ చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
    దళిత క్రైస్తవులకు సామాజిక న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత గిరిజన, క్రైస్తవ మైనారిటీ సంఘాలు, ప్రజాసంఘాలు మేధావులు ప్రజాస్వామ్యవాదులు అందరూ ఐక్యంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని దాసరి సువర్ణ రాజు పిలుపునిచ్చారు

    దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి – సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలి - Additional Image
    అత్యధికంగా చదివినవి