Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలి... సీఐ మంజునాథ్ రెడ్డి

    Author RAJANEETHI | 16 Jul 2026, 03:28 PM | ANDHRA PRADESH
    యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలి... సీఐ మంజునాథ్ రెడ్డి

    రేణిగుంట, జూలై 16 (రాజనీతి): యువత తమ జీవితాన్ని మలుపు తిప్పే విద్యార్థి దశలో చెడు వ్యసనాలకు, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని గాజులమండ్యం సీఐ మంజునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పి సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ మంజునాథ్ రెడ్డి అద్వర్యంలో ఎస్‌ఐ హరీష, పోలీసు సిబ్బంది గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వి.బి.ఆర్. కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ నేటి కాలంలో మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు సమాజానికి పెద్ద సవాలుగా మారాయని, వాటి బారిన పడకుండా ప్రతి విద్యార్థి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులే దేశ భవిష్యత్తని, మీ చేతుల్లోనే కుటుంబం, సమాజం, దేశం యొక్క రేపటి అభివృద్ధి ఉందని తెలిపారు. అందుకే విద్యతో పాటు మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ, చట్టాలపై అవగాహన కూడా ప్రతి విద్యార్థికి అవసరం అన్నారు. ఇటీవలి కాలంలో కొందరు అక్రమ వ్యాపారులు కళాశాలలు, హాస్టళ్లు, యువత ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని గంజాయి, ఎండీఎంఏ, ఇతర సింథటిక్ డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిపారు. మొదట సరదాగా, స్నేహితుల పేరుతో అలవాటు చేసి, తరువాత పూర్తిగా వ్యసనానికి గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి చదువు, ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక పరిస్థితి అన్నింటినీ కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పారు. మాదకద్రవ్యాల ప్రభావంతో యువత మంచి–చెడుల మధ్య తేడాను గుర్తించలేక నేరాలకు పాల్పడే ప్రమాదం కూడా పెరుగుతుందని వివరించారు. ఒక్కసారి డ్రగ్స్‌కు అలవాటు పడితే తిరిగి సాధారణ జీవితంలోకి రావడం చాలా కష్టమవుతుందని, అందుకే జీవితంలో ఒక్కసారి కూడా డ్రగ్స్‌ను ముట్టుకోకూడదన్నారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఆయన విద్యార్థులకు సూచించారు. ఎవరైనా విద్యాసంస్థలు, హాస్టళ్లు, పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు, వినియోగిస్తున్నట్లు, నిల్వ ఉంచుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి, నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని సీఐ మంజునాథరెడ్డి పేర్కొన్నారు. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగించే ప్రతి విద్యార్థి అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్యాంకు అధికారులు, పోలీసులమని చెప్పి వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు ఖాతా నంబర్లు, సీవీవీ, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. తెలియని లింకులు క్లిక్ చేయడం, నకిలీ యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం, సోషల్ మీడియాలో అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవడం ప్రమాదకరమని వివరించారు. మహిళలు, బాలికల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్ గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థిని ఈ యాప్‌ను తమ మొబైల్‌లో తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ఒక బటన్ నొక్కడం ద్వారా పోలీసులకు వెంటనే సమాచారం చేరి సహాయం అందుతుందని తెలిపారు. మహిళలపై వేధింపులు, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ వంటి సంఘటనలు ఎక్కడ జరిగినా మౌనంగా ఉండకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు తమ చదువుపై పూర్తి దృష్టి పెట్టి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని, సమాజానికి ఆదర్శంగా నిలిచే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సీఐ మంజునాథరెడ్డి పిలుపునిచ్చారు. పోలీసులు కేవలం నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకునే వ్యవస్థ మాత్రమే కాదని, నేరాలు జరగకుండా ముందస్తు అవగాహన కల్పించడం కూడా మా బాధ్యత అని తెలిపారు. మీ సహకారం ఉంటేనే సమాజాన్ని నేరరహితంగా తీర్చిదిద్దగలం అన్నారు. ఈకార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.