Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దివంగత మాజీ మంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డికి ఘనంగా నివాళులు

    Author RAJANEETHI | 13 Jul 2026, 02:38 PM | ANDHRA PRADESH
    దివంగత మాజీ మంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డికి ఘనంగా నివాళులు

    కలికిరి, జూలై 13 (రాజనీతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట ముద్రవేసిన దివంగత మాజీ మంత్రి, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నల్లారి అమర్నాథ్ రెడ్డి 39వ వర్ధంతిని కలికిరి మండలం నగిరిపల్లిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన సమాధి వద్ద మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మా తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి ప్రజా జీవితంలో నిబద్ధత, నిజాయితీ, విలువలకు ప్రతీకగా నిలిచారన్నారు. ప్రజా సేవనే పరమావధిగా భావించి జీవితాంతం ప్రజల కోసం పనిచేశారని తెలిపారు. ఆయన చూపిన మార్గమే మా కుటుంబానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. వాయల్పాడు నియోజకవర్గం నుంచి 1962, 1972, 1978, 1985 సంవత్సరాల్లో వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల అపార విశ్వాసాన్ని సంపాదించారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. దేశ మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, పి.వి. నరసింహారావు వంటి జాతీయ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించిన అరుదైన నాయకుల్లో నల్లారి అమర్నాథ్ రెడ్డి ఒకరని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో చిత్తూరు జిల్లా రాజకీయాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడిగా ఆయన నిలిచారని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నల్లారి కుటుంబానికి బలమైన పునాది వేసింది అమర్నాథ్ రెడ్డేనని పేర్కొంటూ, ఆయన రాజకీయ వారసత్వం ప్రజా సేవతో ముడిపడి ఉందన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని తెలిపారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా నల్లారి అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో వివిధ శాఖలకు మంత్రిగా సేవలందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. ప్రజల సంక్షేమమే తన తండ్రి జీవిత లక్ష్యమని, రాజకీయ పదవులను ప్రజా సేవకు వేదికగా ఉపయోగించుకున్న మహానీయుడని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, మౌలిక వసతులు, విద్య, తాగునీటి సదుపాయాల కల్పనలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కలికిరి మండలం నగిరిపల్లి గ్రామం నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించిన నల్లారి అమర్నాథ్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారని, వాయల్పాడు నియోజకవర్గ ప్రజలతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. నాన్నగారు ప్రజలకు చేసిన సేవలు, ఆయన ఆశయాలు, రాజకీయ విలువలు మాకు ఎప్పటికీ మార్గదర్శకం. అదే స్ఫూర్తితో పీలేరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సేవలు అందిస్తాం అని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం కలికిరి పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న నల్లారి అమర్నాథ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఆహారం పంపిణీ చేశారు. వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా పీలేరు రైతు మార్కెట్ యార్డు, కె.వి.పల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్, వాయల్పాడు చింతపర్తి మార్కెట్ యార్డు, గుర్రంకొండ పట్టణం తదితర ప్రాంతాల్లో కూడా నల్లారి అమర్నాథ్ రెడ్డి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నల్లారి అమర్నాథ్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేసిన నాయకుడని, ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ప్రజల మధ్య ఉండి సేవ చేసిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నల్లారి అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత నేతకు ఘన నివాళులర్పించారు.

    అత్యధికంగా చదివినవి