Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

    Author RAJANEETHI | 13 Jul 2026, 01:09 PM | ANDHRA PRADESH
    రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

    రేణిగుంట, జూలై 13 (రాజనీతి): ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, తప్పులులేని విధంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడమే ఈ ప్రత్యేక సర్వే ప్రధాన ఉద్దేశ్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. రేణిగుంట మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను శనివారం పరిశీలించిన అనంతరం బూత్ లెవల్ ఆఫీసర్లు, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత 30 రోజులుగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ఆదివారంతో ముగియనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి బీఎల్‌ఓ తన పరిధిలోని ప్రతి ఓటరిని వ్యక్తిగతంగా కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, వాటిని పూర్తిచేయించి తిరిగి స్వీకరించి, అనంతరం బీఎల్‌ఓ యాప్ ద్వారా డిజిటల్ రూపంలో నమోదు చేశారని వివరించారు. తిరుపతి జిల్లాలో ఈ ప్రక్రియ అత్యంత సమర్థవంతంగా కొనసాగిందని, ఇప్పటికే 99.5 శాతం డిజిటైజేషన్ పూర్తయిందని, మిగిలిన స్వల్ప ప్రక్రియ కూడా త్వరలో పూర్తి కానుందని తెలిపారు. జిల్లా అధికారులు, బీఎల్‌ఓలు, ఎన్నికల సిబ్బంది కృషితో ఈ స్థాయి పురోగతి సాధ్యమైందని అభినందించారు. ప్రత్యేక సర్వేలో భాగంగా మరణించిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ప్రస్తుతం ఆచూకీ లేని వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉన్న డూప్లికేట్ ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వీరిని ఏఎస్‌డీడీ జాబితాలో నమోదు చేసి తదుపరి పరిశీలన అనంతరం చట్టపరమైన విధానంలో ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. అదేవిధంగా 2002 ఓటరు జాబితాతో అనుసంధానం కాని కొంతమంది ఓటర్లను కూడా గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేస్తూ 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాలేదని ఎవరి ఓటునూ తొలగించమన్నారు. అలాంటి వారి పేర్లు జూలై 21న విడుదలయ్యే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఉంటాయని తెలిపారు. వారికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తుందని, అనంతరం ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పిస్తే వారి పేరు తుది ఓటరు జాబితాలో యథావిధిగా కొనసాగుతుందన్నారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పదో తరగతి మార్కుల మెమో, పాస్‌పోర్టు, కుల ధ్రువీకరణ పత్రం, భూమి లేదా ఇంటి హక్కుల పత్రాలు, అటవీ హక్కుల పట్టాలు వంటి ఎన్నికల సంఘం గుర్తించిన 11 రకాల పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో బీఎల్‌ఓలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత నెలరోజులుగా ఇంటింటి సర్వేలో సేకరించిన వివరాలను బీఎల్‌ఏలకు చదివి వినిపించి, సంబంధిత జాబితాలను వారికి అందజేస్తున్నామని చెప్పారు. ఏవైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే వాటిని స్వీకరించి పరిశీలిస్తున్నామని వెల్లడించారు. రేణిగుంట మండలంలోని పోలింగ్ కేంద్రాల పరిశీలనలో బీఎల్‌ఏలు కూడా సర్వే ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. బీఎల్‌ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం వల్ల ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగుతోందని పేర్కొన్నారు. జూలై 21న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల కానుందని, అనంతరం జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరిస్తామని తెలిపారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం-6, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్న వారు, ఓటు బదిలీ చేసుకోవాలనుకునే వారు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, చంద్రగిరి ప్రాంతాల్లో ఉద్యోగాలు, అద్దె ఇళ్లు, ఇతర కారణాలతో తరచుగా నివాస మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. అలాంటి వారు తప్పనిసరిగా తమ ప్రస్తుత చిరునామాకు ఓటును మార్చుకోవాలని సూచించారు.
    అదేవిధంగా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు నమోదైనట్లయితే, అందరినీ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలోకి తీసుకురావడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం ఎన్నికల చట్టాల ప్రకారం నేరమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అలాంటి వారు స్వచ్ఛందంగా ఒకచోట ఓటును తొలగించుకోవాలని సూచించారు. తమ పరిధిలోని బీఎల్‌ఓను సంప్రదిస్తే అవసరమైన మార్పులు వెంటనే చేపడతామని తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అర్హుడైన ఓటరికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా పారదర్శకమైన, విశ్వసనీయమైన ఓటరు జాబితాను సిద్ధం చేయడమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల అధికారులు, తహసీల్దార్, బూత్ లెవల్ ఆఫీసర్లు, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి