Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గ్యారంపల్లి జడ్పీ హైస్కూల్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తేవాలి

    Author RAJANEETHI | 12 Jul 2026, 07:36 PM | ANDHRA PRADESH
    గ్యారంపల్లి జడ్పీ హైస్కూల్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తేవాలి

    పీలేరు, జూలై 12 (రాజనీతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అత్యంత ఆందోళనకరమని, అలాంటి ఘటనలు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు కలిగిస్తాయని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ అన్నారు. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థి నాగార్జున నుంచి టీసీ ఇచ్చే సమయంలో డొనేషన్ పేరుతో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అమృత్ తేజ మాట్లాడుతూ, పాఠశాల యాజమాన్య కమిటీ విడుదల చేసిన వివరణలోనే సంబంధిత విద్యార్థి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో పదో తరగతి పరీక్ష ఫీజును ప్రధానోపాధ్యాయురాలే చెల్లించినట్లు పేర్కొన్నారని గుర్తు చేశారు. ఒకవైపు విద్యార్థి పేదరికాన్ని అంగీకరిస్తూ, మరోవైపు అదే విద్యార్థిని పాఠశాల అభివృద్ధి పేరుతో డొనేషన్ ఇవ్వాలని కోరడం అనేక సందేహాలకు తావిస్తోందని అన్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులు ఈ అంశంపై ముందుగానే మండల విద్యాశాఖ అధికారిని కలిసి సమస్యను వివరించి పరిష్కారం కోరినట్లు సమాచారం ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా టీసీ తీసుకునేందుకు వచ్చిన విద్యార్థి నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వస్తుండటం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. టీసీ అవసరమైన సమయంలో డొనేషన్ అడిగితే, అది నిజంగా స్వచ్ఛంద విరాళమా, పరిస్థితుల వల్ల, ఒత్తిడితో చెల్లించిన మొత్తమా అనే విషయం విచారణలో తేల్చాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. అలాంటి పాఠశాలల్లో టీసీలు, సర్టిఫికెట్లు, ఇతర సేవల కోసం ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడం దురదృష్టకరమని అన్నారు. పాఠశాల అభివృద్ధికి నిధులు అవసరమైతే గతంలో అక్కడ చదివి ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు, దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం కోరడం సరైన మార్గమని సూచించారు. కానీ ఉన్నత చదువుల కోసం టీసీ తీసుకుని వెళ్తున్న విద్యార్థుల నుంచి విరాళాలు కోరడం విద్యా విలువలకు, నైతిక ప్రమాణాలకు విరుద్ధమని తెలిపారు. పాఠశాల యాజమాన్య కమిటీ నిర్ణయంతోనే ఈ చర్యలు చేపట్టామని చెబితే, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నుంచి డబ్బులు సేకరించే అధికారం ఎవరికుంది? డబ్బులు ఎవరు సేకరించారు? అధికారిక రసీదులు జారీ చేశారా? ఏ ఖాతాలో జమ చేశారు? పాఠశాల యాజమాన్య కమిటీ తీర్మానం ఏమిటి? వంటి ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కూడా ఇదే విధంగా డొనేషన్ల పేరుతో ఎంత మొత్తం వసూలు చేశారు? ఆ నిధులను ఏ పనులకు వినియోగించారు? ఆదాయం–వ్యయ లెక్కలు, బిల్లులు, వౌచర్లు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆడిట్ నివేదికలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి పారదర్శకత పాటించినప్పుడే ప్రజల్లో నెలకొన్న అనుమానాలు తొలగుతాయని అన్నారు. ఈ ఘటనలో మరో ఆందోళనకర అంశం ఏమిటంటే, తనపై జరిగిన విషయాన్ని విద్యార్థి బయటపెట్టిన తర్వాత పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ విడుదల చేసిన వివరణలో విద్యార్థి వ్యక్తిత్వం, ప్రవర్తనపై వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని అమృత్ తేజ అన్నారు. ఒక మైనర్ విద్యార్థిపై బహిరంగంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ముఖ్యంగా తండ్రిని కోల్పోయి, ఆర్థికంగా వెనుకబడిన దళిత కుటుంబానికి చెందిన విద్యార్థిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అతని ఆత్మగౌరవాన్ని, మానసిక స్థితిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కూడా విచారణలో భాగంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ ఘటనపై న్యాయబద్ధమైన, నిష్పాక్షిక, పారదర్శక విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, భవిష్యత్తులో ఏ విద్యార్థి కూడా టీసీ, సర్టిఫికెట్, ఇతర విద్యాసంబంధ సేవల కోసం ఎలాంటి ఆర్థిక ఒత్తిడికి గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ విజ్ఞప్తి చేశారు.

    అత్యధికంగా చదివినవి