Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు ఘనంగా నివాళులు

    Author RAJANEETHI | 09 Jul 2026, 12:03 PM | ANDHRA PRADESH
    పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు ఘనంగా నివాళులు

    పవన్ కళ్యాణ్ చూపిన మానవత్వం యావత్ సమాజానికి ఆదర్శం – జనసేన నాయకుడు మిథున్ షాలి

    రేణిగుంట, జూలై 9 (రాజనీతి): జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన నిరంజన్ మృతి పట్ల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బుధవారం సాయంత్రం పట్టణంలో శాంతియుత క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. నిరంజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, పవన్ కళ్యాణ్‌పై ఆయనకున్న అచంచలమైన అభిమానాన్ని స్మరించుకున్నారు. చాలా కాలంగా అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ తన జీవితంలో చివరి కోరికగా ఒక్కసారి పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా చూడాలని కోరుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన బిజీ రాజకీయ కార్యక్రమాలను పక్కనబెట్టి, ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా స్వయంగా నిరంజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి, నిరంజన్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పవన్ కళ్యాణ్ చూపిన ఈ మానవత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రశంసలు అందుకుంది. అయితే వ్యాధి తీవ్రత పెరగడంతో నిరంజన్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తీవ్ర మనోవేదనకు గురై సామాజిక మాధ్యమం ద్వారా సంతాపం తెలియజేశారు. నిరంజన్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నిరంజన్ మృతి వార్తతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనసేన శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. పలుచోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా సంతాప సభలు నిర్వహించి నివాళులర్పించారు. రేణిగుంటలో నిర్వహించిన సంతాప ర్యాలీలో జనసేన నాయకుడు మిథున్ షాలి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. నిరంజన్ సాధారణ అభిమాని కాదని... పవన్ కళ్యాణ్‌ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నిజమైన జనసైనికుడు అన్నారు. తన చివరి కోరికను తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించడం ఆయన గొప్ప మానవత్వానికి నిదర్శనం అని తెలిపారు. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలిచే మహోన్నత వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్‌ది అని అన్నారు. దైవం మానుష రూపేణ అనే మాటకు నిజమైన అర్థం పవన్ కళ్యాణ్ రూపంలో కనిపించిందని తెలిపారు. ఒక అభిమాని చివరి కోరికను నెరవేర్చడానికి ఆయన చూపిన ప్రేమ, ఆప్యాయత, మానవత్వం జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. నిరంజన్ ఇక మన మధ్య లేకపోయినా, పవన్ కళ్యాణ్‌పై అతనికున్న అభిమానం ప్రతి జనసైనికుడికి స్ఫూర్తిగా నిలుస్తుందని మిథున్ షాలి పేర్కొన్నారు. నిరంజన్ ఇప్పుడు భౌతికంగా దూరమైనా, అతని జ్ఞాపకాలు, పవన్ కళ్యాణ్‌పై అతను చూపిన విశ్వాసం, ప్రేమ శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ప్రతి జనసైనికుడు నిరంజన్‌ను కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నాడని, అతని మరణం జనసేన కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు క్యాండిళ్లు వెలిగించి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. నిరంజన్ అమర్ రహే, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నినాదాలతో నివాళులర్పించారు. అనంతరం నిరంజన్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి