Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యం.. 77 ఏళ్లుగా విద్యార్థి ఉద్యమంలో ఎబివిపి ప్రయాణం...

    Author RAJANEETHI | 08 Jul 2026, 03:24 PM | ANDHRA PRADESH
    జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యం.. 77 ఏళ్లుగా విద్యార్థి ఉద్యమంలో ఎబివిపి ప్రయాణం...

    చిత్తురు (జులై 08),(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం సాధించాలనే లక్ష్యంతో ఏర్పడిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగిందని ఆ సంస్థ తిరుపతి–కడప విభాగ్ సంఘటన మంత్రి సాయి సత్యనారాయణ తెలిపారు. జూలై 9, 1949న ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఎబివిపి, నేడు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, జిల్లాల స్థాయిలో విస్తరించి లక్షలాది మంది విద్యార్థులను జాతీయ భావాలతో కూడిన నాయకత్వం వైపు తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు.సంస్థ ఆవిర్భావం వెనుక ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవా భావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమేనని వివరించారు."జ్ఞానం–శీలం–ఏకత" అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి విద్యార్థి సమాజంలో విలువల ఆధారిత నాయకత్వాన్ని పెంచేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు. భారతీయ జ్ఞాన సంపద, సంస్కృతి, జాతీయ చైతన్యాన్ని యువతకు చేరవేయడంలో ఎబివిపి కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి ఉద్యమాలు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. వేలాది మంది కార్యకర్తలు అరెస్టులు, లాఠీచార్జీలు ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయలేదని తెలిపారు. ఆ పోరాటం ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిందని పేర్కొన్నారు. కాశ్మీర్‌లో జాతీయ జెండా గౌరవాన్ని చాటేందుకు నిర్వహించిన "చలో కాశ్మీర్" కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సంఘటనను సంస్థ చారిత్రాత్మక ఘట్టంగా భావిస్తోందన్నారు. అలాగే ఈశాన్య ప్రాంతాల సమగ్రత కోసం నిర్వహించిన "చలో చికెన్ నెక్" కార్యక్రమం ద్వారా జాతీయ సమైక్యత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని వివరించారు. విద్యా సంస్థల్లో ట్రేడ్ యూనియన్ రాజకీయాల కంటే విద్యార్థి, ఉపాధ్యాయులు, యాజమాన్యం, తల్లిదండ్రులు కలిసి విద్యా కుటుంబంగా ముందుకు సాగాలనే భావనను ఎబివిపి ప్రోత్సహిస్తోందన్నారు.స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుల జయంతులు, వర్ధంతులను నిర్వహిస్తూ వారి స్ఫూర్తిని విద్యార్థులకు చేరవేస్తున్నట్లు తెలిపారు. విద్యా రంగంలో అవినీతి, ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించామని, ప్రతిభకు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో అనేక అంశాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు. జాతీయ విద్యా విధానంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపట్టడం సంస్థ ప్రధాన కార్యాచరణలో భాగమని వివరించారు. సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ఎబివిపి పెద్దపీట వేస్తోందని, రక్తదాన శిబిరాలు, మొక్కల నాటకం, స్వచ్ఛభారత్ కార్యక్రమాలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, గ్రామ సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మంది విద్యార్థులను సమాజ సేవలో భాగస్వాములను చేస్తోందన్నారు. "నేటి విద్యార్థి నేటి పౌరుడే" అనే భావనతో సమాజానికి బాధ్యతగల యువతను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.జాతీయ సమైక్యత, దేశభక్తి, సేవ, సంస్కారం అనే నాలుగు స్తంభాలపై సంస్థ ప్రయాణం కొనసాగుతోందని, "నేషన్ ఫస్ట్ – సెల్ఫ్ నెక్స్ట్" అనే భావనతో దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు శ్రీ సాయి సత్యనారాయణ పేర్కొన్నారు. దేశానికి మంచి పౌరులను అందించే "మ్యాన్ మేకింగ్ మిషన్"గా ఎబివిపి తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని ఆయన అన్నారు.

    అత్యధికంగా చదివినవి