Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అశ్రునయనాల మధ్య ఘనంగా షహాదత్ కార్యక్రమం

    Author RAJANEETHI | 27 Jun 2026, 05:47 PM | ANDHRA PRADESH
    అశ్రునయనాల మధ్య ఘనంగా షహాదత్ కార్యక్రమం

    రేణిగుంట పట్టణంలోని మిరియాల బాబా గౌసియా ఆశ్రమంలో మొహర్రం మాసం పదో రోజు నిర్వహించే పవిత్ర షహాదత్ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, అశ్రునయనాల మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రపంచ మానవాళి శాంతి, ధర్మ పరిరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన కర్బలా అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని నివాళులర్పించారు. గౌసియా ఆశ్రమ పీఠాధిపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మషాయక్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి ఖ్వాజా జూబేర్ హయాత్ అలీ షా ఖాదరీ ఆధ్వర్యంలో ఆశ్రమ ఆధ్యాత్మిక శిష్య బృందం సంప్రదాయబద్ధంగా పీర్లను ఊరేగింపుగా తీసుకెళ్లి నీటి ప్రస్థాన కార్యక్రమాన్ని నిర్వహించింది. భక్తుల ప్రార్థనలు, దువాలు, ఫాతెహా పఠనాలతో ఆశ్రమ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా పీఠాధిపతి ఖ్వాజా జూబేర్ హయాత్ అలీ షా ఖాదరీ మాట్లాడుతూ, ప్రవక్త హజరత్ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ (అలైహిస్సలాం) ధర్మం, న్యాయం, మానవత్వం కోసం కర్బలా యుద్ధంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రాణత్యాగం చేసిన రోజు మొహర్రం మాసం పదో రోజైన యౌమే షహాదత్ అని తెలిపారు. మానవ విలువలు, సత్యం, ధర్మం కోసం చేసిన ఆ త్యాగం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. కర్బలా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఆశ్రమంలో పీర్లను ప్రతిష్ఠించి పదో రోజు సంప్రదాయం ప్రకారం నీటి ప్రస్థానం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల్లో మానవత్వం, సోదరభావం, న్యాయం, ధర్మబద్ధమైన జీవన విధానంపై అవగాహన పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
    మొహర్రం సందర్భంగా తిరుపతి, కడప, అనంతపురం తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆశ్రమానికి తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొని అమరవీరుల జ్ఞాపకార్థం ప్రార్థనలు చేశారని తెలిపారు. మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు కలిసి కార్యక్రమంలో పాల్గొనడం భారతదేశ లౌకిక స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. అనంతరం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్కు కర్బలా అమరవీరుల పేరిట ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. అనంతరం భక్తులకు సుమారు 500 లీటర్ల పానకం పంపిణీ చేయడంతో పాటు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మిరియాల బాబా ఆధ్యాత్మిక శిష్య బృందం, ఖ్వాజా జూబేర్ హయాత్ ఖాదరీ శిష్య బృందం, శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పూజారులు, ఏ–1 క్యాటరింగ్ తిరుపతికి చెందిన ఎస్. మస్తాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మషాయక్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఎస్. రహమాన్ షరీఫ్, రేణిగుంట మండల అధ్యక్షుడు రైటర్ మహబూబ్ బాషా, సత్తార్ ఖాదరీ, సుభాన్ ఖాదరీ, తిరుపతి జాఫర్, బాలాజీ, నందా, రహమత్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    అశ్రునయనాల మధ్య ఘనంగా షహాదత్ కార్యక్రమం - Additional Image
    అత్యధికంగా చదివినవి