Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయ జీర్ణోద్ధారణ మహా కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం

    Author RAJANEETHI | 24 Jun 2026, 08:07 AM | ANDHRA PRADESH
    ఘనంగా శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయ జీర్ణోద్ధారణ మహా కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం

    రేణిగుంట మండలం గాజులమండ్యం గ్రామంలో వెలసిన సీతా లక్ష్మణ హనుమ పరివార సమేత శ్రీశ్రీశ్రీ పట్టాభిరామస్వామి వారి దేవాలయ జీర్ణోద్ధారణ మహా కుంభాభిషేక మహోత్సవాలు మంగళవారం ఆధ్యాత్మిక వైభవం మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. భవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాస శుద్ధ పర్వదినాలను పురస్కరించుకుని ఆలయంలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మహోత్సవాల్లో తొలి రోజు మంగళవారం ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భగవత్ ప్రార్థన, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాసూత్ర పూజ, పంచగవ్య ఆరాధన, రక్షాసూత్రధారణ, ఆచార్య, ఋత్విగ్వరణం, యజమాన దీక్ష వంటి శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మృత్సంగ్రహణం, అంకురార్పణ, అగ్నిమథనం, పంచాగ్నులలో అగ్నిప్రతిష్ఠ, కుంభసాధన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా బాలాలయంలోని బింబాల నుంచి కలాపకర్షణ కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం కుంభారాధన, యుక్తహోమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణం అంతా మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాలు, గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మహోత్సవాల్లో రెండో రోజు బుధవారం కూడా ప్రత్యేక శాస్త్రోక్త కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అందులో భాగంగా విష్వక్సేన పూజ, పుణ్యహవచనం, అగ్నిప్రణయణం, కుంభారాధన, వాస్తుహోమం, పంచగవ్య, క్షీర, జలాధివాసాలు, అధివాసాంగ హోమాలు, రత్నన్యాసం, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. అలాగే చతుర్దశ కలశ సహిత మహాశాంతి, అభిషేకం, ప్రధాన హోమాలు, శయనాధివాసం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నారు. మహోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం గురువారం ఉదయం స్వాతి ముహూర్తంలో నిర్వహించనున్నారు. ఆ రోజు సుప్రభాతం, విష్వక్సేన పూజ, పుణ్యహవచనం, అగ్నిప్రణయణం, కుంభారాధన, యుక్తహోమం, మహాపూర్ణాహుతి తర్వాత నిర్ణీత సుముహూర్తంలో కళావాహనం, మహా కుంభాభిషేకం, ప్రథమ దర్శనం, మహాదాశీర్వచనం కార్యక్రమాలు జరగనున్నాయి. మహాకుంభాభిషేకం అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ, మహా అన్నదాన కార్యక్రమం, సీతారామ కళ్యాణ మహోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు లక్ష్మీ కృష్ణారెడ్డి, రెడ్డివారి దినకర్ రెడ్డి, రెడ్డివారి వేదకిషన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ పరివార సమేత శ్రీ పట్టాభిరామస్వామి వారి అనుగ్రహం పొందేందుకు గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. స్వామివారి కృపతో అందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు పొందాలని ఆకాంక్షించారు.

    అత్యధికంగా చదివినవి