Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా మార్గం

    Author RAJANEETHI | 20 Jun 2026, 05:50 PM | ANDHRA PRADESH
    ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా మార్గం

    భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక, ఆరోగ్య వారసత్వం యోగా అని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్ధాల రవిబాబు పిలుపునిచ్చారు. శనివారం రేణిగుంట మండలం ఆర్.మల్లవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మానవ హక్కులు, సామాజిక అభివృద్ధి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మర్ధాల రవిబాబు మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప జీవన విధానమన్నారు. పతంజలి మహర్షి రూపొందించిన యోగ సాధన నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో ఆరోగ్యానికి మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. యోగాను ప్రపంచ ప్రజలందరికీ చేరువ చేయాలనే సంకల్పంతో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్య సమస్యల నేపథ్యంలో యోగా ప్రతి ఒక్కరికీ అత్యవసరమైందన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆధ్యాత్మిక ఆనందం, రోగనిరోధక శక్తి పెరుగుతాయని వివరించారు. మన శరీరానికి ప్రాణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో కనీసం ఒక గంట సమయాన్ని యోగా కోసం కేటాయించాలని సూచించారు. శరీరాన్ని కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తలే ఉత్తమ వైద్యం అని పేర్కొన్నారు. నియమితంగా యోగా సాధన చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గి జీవన నాణ్యత మెరుగుపడుతుందని వివరించారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం నినాదంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఒక శక్తివంతమైన సాధనమని తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ – ఆరోగ్య భారతదేశం నిర్మాణంలో యోగా పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా యోగా విశిష్టతపై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పాఠశాల దశ నుంచే విద్యార్థులు యోగాపై అవగాహన పెంచుకుని జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. చదువులో ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. యోగా మన భారతీయ వారసత్వమని, దీనిని కాపాడుతూ తదుపరి తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మర్ధాల రవిబాబు విద్యార్థులకు ప్రత్యక్షంగా సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన, శ్వాస నియంత్రణ పద్ధతులు, శరీర సమతుల్య, యోగాసనాలు నేర్పించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని యోగా సాధన చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు, ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, విశ్వవిద్యాలయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

    ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా మార్గం - Additional Image
    అత్యధికంగా చదివినవి