Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైతు భూమిపై హక్కు రైతుదే.. కాపాడే బాధ్యత మాది: చంద్రబాబు

    రైతు భూమిపై హక్కు రైతుదే.. కాపాడే బాధ్యత మాది: చంద్రబాబు

    రాజనీతి | ప్రకాశం జిల్లా | అక్టోబర్‌ 9, 2026

    రైతుల భూములపై వారి హక్కులను కాపాడే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతులు నాగలి పట్టుకుని పొలాలకు వెళ్లాలే తప్ప అర్జీలు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం నర్సింగోలులో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. భూమి రైతుదేనని, దానిపై హక్కును పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతని ప్రకటించారు.

    రైతులు అర్జీలతో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. రాష్ట్రవ్యాప్తంగా 40.58 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ | ప్రకాశంలో దశాబ్దాల భూ వివాదాలకు పరిష్కారం


    రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40.58 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. అక్టోబర్‌ నెలలోనే 793 గ్రామాల్లో 4.58 లక్షల మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందించామని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 24,116 పాస్‌పుస్తకాలు పంపిణీ చేసినట్లు వివరించారు. భూ రికార్డుల ప్రక్షాళన, రీసర్వే, పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

    ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న గర్భ కండ్రిక భూముల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. నాలుగు మండలాల్లోని ఎనిమిది గ్రామాలకు సంబంధించిన సుమారు 2,915 ఎకరాల భూములు దీర్ఘకాలంగా వివాదాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారంతో 1,301 మంది రైతులకు భూ హక్కులు లభించేలా చర్యలు చేపట్టారు. ఏళ్ల తరబడి తమ భూములపై స్పష్టమైన హక్కు పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు.

    ఇవి కూడా చదవండి

    గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థ వివాదాలకు కేంద్రంగా మారిందని చంద్రబాబు ఆరోపించారు. భూ ఆక్రమణలు, రికార్డుల్లో అవకతవకలు, నిషేధిత జాబితాల్లో భూముల నమోదు వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. రైతుల ఆస్తులకు భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను అందించడం ద్వారా భూ యాజమాన్య వివరాలపై స్పష్టత తీసుకొస్తున్నామని వివరించారు.

    ఈ సందర్భంగా కొండపి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. సుమారు రూ.166 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రిజర్వాయర్‌ పూర్తయితే 9,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. అలాగే ముప్పాళ్ల వద్ద రూ.27.85 కోట్లతో నిర్మించనున్న వంతెన పనులకు శంకుస్థాపన చేశారు.

    రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఎనిమిది మంది కేంద్ర మంత్రులను కలిసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కృషి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

    స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైనా ముఖ్యమంత్రి స్పందించారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీ అభ్యర్థులకు 34 శాతం స్థానాలు కేటాయిస్తామని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ బీసీల రాజకీయ అవకాశాలను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించడం, రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడం, అర్హులైన ప్రతి రైతుకూ హక్కు పత్రాలు అందించడమే ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.