అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు తప్పవు... సీఐ మంజునాథ్ రెడ్డి
తిరుపతి, జూలై 24 (రాజనీతి): రేణిగుంట మండలం ఎస్.ఆర్. పట్టెడ సమీపంలోని స్వర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుక తవ్వకం, రవాణా జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేశారు. వీఆర్వో కె. మల్లికార్జున రెడ్డి ఫిర్యాదు ఆధారంగా నిర్వహించిన తనిఖీల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా జేసీబీ సాయంతో ట్రాక్టర్‌లో ఇసుక లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. జేసీబీ, ట్రాక్టర్ డ్రైవర్ల వివరాలు నమోదు చేసి, వాహనాలను గుర్తించిన పోలీసులు అక్రమ ఇసుక తవ్వకం, రవాణాలో పాల్గొన్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.