4 కిలోల గంజాయితో ముగ్గురు అరెస్ట్.. ప్రధాన నిందితుల గుట్టురట్టు
రాయచోటి, జూలై 15 (రాజనీతి): అన్నమయ్య జిల్లా రామాపురం పోలీసుల ప్రత్యేక ఆపరేషన్‌లో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. గువ్వలచెరువు ఘాట్ వద్ద బోడన్నా (విశాఖ), ఖాదర్ బాషా (రాయచోటి), పరిమల ప్రకాష్ (బీహార్)లను అదుపులోకి తీసుకుని 4 కిలోల గంజాయి, ఒక మోటార్‌సైకిల్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి గంజాయి తెచ్చి బెంగళూరులో పోర్టర్ యాప్ ద్వారా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. ప్రజలు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే 100/112 లేదా టోల్‌ఫ్రీ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు.