అంగరంగ వైభవంగా శ్రీ పట్టాభిరామస్వామి జీర్ణోద్ధారణ మహా కుంభాభిషేక మహోత్సవం
రేణిగుంట మండలం గాజులమండ్యం గ్రామం గురువారం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. గ్రామంలో వెలసిన సీత, లక్ష్మణ, హనుమత్ పరివార సమేత శ్రీశ్రీశ్రీ పట్టాభిరామస్వామి వారి దేవాలయంలో మూడు రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగిన జీర్ణోద్ధారణ మహా కుంభాభిషేక మహోత్సవాలు గురువారం మహా కుంభాభిషేకంతో ఘనంగా ముగిశాయి. వేదపండితుల మంత్రోచ్చారణలు, నాదస్వర మంగళవాయిద్యాలు, జై శ్రీరామ్ నినాదాలు, వేలాది మంది భక్తుల భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతితో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచే గాజులమండ్యం గ్రామానికి భక్తుల రాక ప్రారంభమైంది. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పుణ్యఫలాన్ని పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, గ్రామ వీధులన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో...