తక్షణ చర్యతో నీటి సమస్యకు పరిష్కారం.. ఈవో రమేష్‌పై కాలనీవాసుల ప్రశంసలు

రేణిగుంట పంచాయతీ పరిధిలోని సీబీఐడీ కాలనీ వెనుక భాగంలో ఉన్న బాలాజీ నగర్‌లో గత రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను పంచాయతీ కార్యదర్శి రమేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. పరిశీలనలో సర్కార్ చెట్లు ఏపుగా పెరిగి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి, మోటార్లు పనిచేయక నీటి సరఫరా అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. వెంటనే జేసీబీ సహాయంతో చెట్లను తొలగించి నీటి సరఫరా పునరుద్ధరించాలని సిబ్బందిని ఆదేశించారు. సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు ఈవో రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.