గరుడసేవకు పక్కా ప్రణాళికతో బస్సుల నిర్వహణ... డీపీటీవో శ్రీనివాసరావుకు ఆర్టీసీ నాయకుల అభినందనలు

తిరుపతి, సెప్టెంబరు 22 (రాజనీతి): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత శనివారం నిర్వహించిన గరుడసేవకు పక్కా ప్రణాళికతో బస్సులు నడిపి తిరుమలకు వెళ్లే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించిన జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావును ఆర్టీసీ నాయకులు అభినందించారు. స్టార్‌ కృష్ణ, ఆవుల ప్రభాకర్‌యాదవ్‌, వర్మ, శ్రీనాథ్‌ తదితరులు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కండువాతో సత్కరించారు. గరుడసేవ విజయవంతానికి నెల్లూరు ఈడీ జగదీష్‌, డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్‌, డిప్యూటీ సీఎంఈ బాలాజీ, డిపో మేనేజర్లు, ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు అందించిన సేవలను కొనియాడారు. ఇదే స్ఫూర్తితో వచ్చే నెల జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆర్‌ఎం శ్రీనివాసరావు కోరారు.