రాపూరు–చిట్వేలు ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుత కలకలం
చిట్వేలు, ఆగస్టు 9 (రాజనీతి): రాపూరు–చిట్వేలు ఘాట్ రోడ్డులో మరోసారి చిరుతపులి ప్రత్యక్షం కావడంతో వాహనదారులు, స్థానికుల్లో భయాందోళన నెలకొంది. మంగళవారం రాత్రి ఘాట్ రోడ్డులోని ప్రహరీ గోడపై చిరుత నిద్రిస్తుండగా, అటుగా వెళ్తున్న కారు హెడ్లైట్ల వెలుగు పడటంతో అప్రమత్తమై సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కారులోని ప్రయాణికులు చిరుతను గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప రాత్రివేళ ఘాట్ రోడ్డులో ప్రయాణించవద్దని స్థానికులు సూచిస్తున్నారు.