క్యాన్సర్‌ రహిత సమాజ నిర్మాణానికే హెచ్‌పీవీ టీకాలు

వాయల్పాడు, సెప్టెంబర్‌ 1 (రాజనీతి): గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాలు అందిస్తున్నట్లు చింతపర్తి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ జులేఖ బేగం, డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ రఫీ తెలిపారు. మంగళవారం పీహెచ్‌సీలో తల్లిదండ్రుల సమక్షంలో బాలికలకు టీకాలు వేశారు. ఇంటింటి సర్వే ద్వారా అర్హులను గుర్తించినట్లు తెలిపారు. హెచ్‌పీవీ టీకా సురక్షితమైనదని, తల్లిదండ్రులు అపోహలకు లోనుకాకుండా తమ పిల్లలకు టీకాలు వేయించాలని సూచించారు. అనంతరం బాలికలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, బాలికల తల్లిదండ్రులు పాల్గొన్నారు.