బోయకొండ దేవస్థానం చైర్మన్ పదవి వాల్మీకులకు కేటాయించాలని వినతి

పుంగనూరు, జూలై 31 (రాజనీతి): బోయకొండ శ్రీ గంగమ్మ దేవస్థానంలో వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో దేవస్థానం చైర్మన్ పదవిని వాల్మీకి సామాజిక వర్గానికి కేటాయించాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సమితి నాయకుడు గంపల గంగరాజు మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధిలో వాల్మీకి, బీసీ వర్గాల సేవలు ఉన్నాయని పేర్కొన్నారు. దేవస్థానం కమిటీల్లో బీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, బోయకొండ దేవస్థానం చైర్మన్ పదవిని వాల్మీకి వర్గానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వాల్మీకి సంఘం రాష్ట్ర, ఉమ్మడి చిత్తూరు–అన్నమయ్య జిల్లాల నాయకులు పాల్గొన్నారు.