🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 25 Jul, 2026 | Page: 1

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి తొలి విజయం - ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ

పీలేరు,అన్నమయ్య జిల్లా(25 జూలై 2026):

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు సాగించిన నిరంతర పోరాటానికి లభించిన తొలి విజయమని ఎన్‌ఎస్‌యూఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ పేర్కొన్నారు. NEET పరీక్షకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా అమృత్ తేజ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే విధంగా పరీక్షల నిర్వహణలో చోటుచేసుకునే లోపాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదన్నారు. దేశంలోని ప్రతి విద్యార్థికి పారదర్శకమైన, నమ్మకమైన పరీక్షా వ్యవస్థను అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు విద్యార్థుల గొంతుకను దేశానికి వినిపించాయని, ఈ రాజీనామా ఆ పోరాటానికి నైతిక గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు. అయితే, రాజీనామాతోనే అంశం ముగిసిపోలేదని, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని, విద్యార్థుల విశ్వాసాన్ని పునరుద్ధరించే చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని ఎన్‌ఎస్‌యూఐ తరఫున కోరారు.
🏠 Home