🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 25 Jul, 2026 | Page: 1

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం... సిఐ జయచంద్ర

రేణిగుంట, జూలై 25 (రాజనీతి): గంజాయి, మాదకద్రవ్యాలు, నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని సీఐ జయచంద్ర తెలిపారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిధిలోని పార్సల్ కార్యాలయాలు, ప్రైవేటు కొరియర్ కేంద్రాల్లో పోలీసు సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ పార్సల్, కొరియర్ సేవలను కొందరు నేరస్థులు గంజాయి, మాదకద్రవ్యాలు, నిషేధిత వస్తువుల అక్రమ రవాణాకు ఉపయోగించే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి పార్సిల్‌ను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు బుకింగ్ సమయంలో పంపిన వ్యక్తి, స్వీకరించే వ్యక్తి వివరాలు, గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు చెప్పారు. అనుమానాస్పదంగా కనిపించే పార్సిళ్లు, అసాధారణ బరువు ఉన్న ప్యాకెట్లు, అనుమానం కలిగించే పరిస్థితులు ఎదురైతే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సిబ్బంది స్వయంగా పార్సిళ్లను తెరవడానికి ప్రయత్నించకుండా పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు. మీ అప్రమత్తతతోనే అక్రమ రవాణాను ప్రారంభ దశలోనే అడ్డుకోవచ్చు అని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో పార్సల్, కొరియర్ సంస్థల నిర్వాహకుల పాత్ర అత్యంత కీలకమని ఆయన అన్నారు. పోలీసులతో సమన్వయం పాటిస్తూ ప్రతి పార్సిల్‌పై అప్రమత్తంగా వ్యవహరిస్తే నేరాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పార్సల్ కార్యాలయాలు, కొరియర్ కేంద్రాల్లో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం నిర్వహిస్తామని సీఐ జయచంద్ర స్పష్టం చేశారు. ప్రజలు, పార్సల్ కేంద్రాల నిర్వాహకులు, కొరియర్ సంస్థలు పోలీసులకు సహకరించి మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
🏠 Home