🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 23 Jul, 2026 | Page: 1

నేతన్నకు భరోసా.. యువతకు ఉద్యోగాల హామీ - రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాల వెల్లడి

అమరావతి, జూలై 23:
రాష్ట్రంలో సంక్షేమం, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత వేగం తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 25కు పైగా అంశాలకు ఆమోదం లభించింది.

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ 'నేతన్న భరోసా' పథకం కింద బీపీఎల్ చేనేత కుటుంబాలకు చెందిన 50 ఏళ్లలోపు కార్మికులకు సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. వేలాది కుటుంబాలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా రెండో దశలో 3,168 పోస్టుల నియామకాలపై కేబినెట్ చర్చించింది. దీనిపై మరింత అధ్యయనం అనంతరం మంత్రివర్గ ఉపసంఘం తుది నిర్ణయం తీసుకోనుంది.

విద్యారంగంలో బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రతా ఏర్పాట్ల కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు.

పరిశ్రమలు – విద్యుత్ రంగానికి ఊతం

రాష్ట్రంలో పెట్టుబడులు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే దిశగా పలు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లాలో 700 మెగావాట్ల సౌర, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు, గండికోట పంప్డ్ స్టోరేజ్ పరిధిలో 1,800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, కుప్పంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్, మినీ హైడల్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు, అనుమతులు మంజూరు చేసింది.

విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులకు ప్రాధాన్యం

విశాఖలో నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్ కళాశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి భూములు కేటాయించారు. అలాగే విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో చేర్చేందుకు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. నీటిపారుదల రంగంలో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి రూ.641 కోట్ల పరిపాలనా అనుమతి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2 వ్యయ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పర్యాటక రంగానికి కొత్త ఊపు

రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో చిత్తూరు, కాకినాడల్లో ప్రపంచ స్థాయి రిసార్ట్స్, స్టార్ హోటళ్లు, టూరిజం ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూముల బదిలీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయనగరంలో కొత్త పరిశ్రమ, పుట్టపర్తిలో ఏరోస్పేస్ ప్రాజెక్టుకు కూడా మార్గం సుగమమైంది.

రైతులు, పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహం

అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్ల రూపంలో పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడలో జెట్ సిటీ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి అవసరమైన ఒప్పందాల సవరణలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

సంక్షేమం, ఉపాధి, విద్య, పరిశ్రమలు, పర్యాటకం, మౌలిక వసతులు వంటి కీలక రంగాల్లో తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపనున్నాయని ప్రభుత్వం తెలిపింది.
🏠 Home