పీలేరు ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి – సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మంగిరి సాంబశివ, పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టి.ఎల్. వెంకటేష్
జూలై 31, ఆగస్టు 1, 2 తేదీలలో పీలేరు పట్టణంలో నిర్వహించనున్న సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మంగిరి సాంబశివ, పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టి.ఎల్. వెంకటేష్ పిలుపునిచ్చారు.
బుధవారం కెవి మండలం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద కరపత్రాలు విడుదల చేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పీలేరు నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులు నత్తనడకన సాగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. పీలేరు పట్టణంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలస్యంతో ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
పీలేరు నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, నూతన పరిశ్రమలు లేకపోవడంతో యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వనరులకు అనుగుణంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు శాశ్వత ఉపాధి కల్పించాలని, వలసలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులు కష్టపడి పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు సరిపడా గిడ్డంగులు లేక తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి మండలంలో ఆధునిక గిడ్డంగులు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన పేదలు, కార్మికులకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సొంత ఇంటి స్థలం ప్రతి పేద కుటుంబానికి రాజ్యాంగబద్ధమైన జీవన హక్కులో భాగమని, ఆ హక్కును ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, లేకపోతే ప్రజలను సమీకరించి సీపీఐ ఆధ్వర్యంలో విస్తృత ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే వరకు సీపీఐ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యురాలు పెద్దిరెడ్డి కవిత రెడ్డి , దామోదర,సాలమ్మ, రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు