🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 22 Jul, 2026 | Page: 1

తల్లికి వందనం తో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా..... కుసుమ కుమారి

రేణిగుంట, జూలై 21 (రాజనీతి): విద్యార్థుల విద్యాభివృద్ధి, కుటుంబాల ఆర్థిక భారం తగ్గింపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన పొందుతోందని టీడీపీ రేణిగుంట మండల మహిళా అధ్యక్షురాలు కుసుమ కుమారి పేర్కొన్నారు. ఈ పథకం కింద రెండో విడత నిధుల విడుదల విద్యార్థుల విద్యా ప్రగతికి మరింత దోహదపడుతుందన్నారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుసుమ కుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. అందులో భాగంగానే తల్లికి వందనం పథకం రెండో విడత నిధులను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ పథకం ద్వారా మండలంలోని అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ అవుతాయని చెప్పారు. ఈ మొత్తాన్ని ఇతర అవసరాలకు ఖర్చు చేయకుండా, పిల్లల చదువు, పుస్తకాలు, యూనిఫాంలు, ఫీజులు, విద్యా సామగ్రి వంటి అవసరాలకే వినియోగించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయం పిల్లల భవిష్యత్తు కోసం. ఈ డబ్బును ఇతరులకు ఇవ్వడం, అనవసర ఖర్చులకు వినియోగించడం చేయకుండా పూర్తిగా విద్య కోసం ఉపయోగించాలన్నారు. ప్రతి రూపాయి పిల్లల అభివృద్ధికి ఉపయోగపడితేనే ఈ పథకం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ ఏడాది ప్రత్యేకంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పిల్లలను కూడా తల్లికి వందనం పథకం పరిధిలోకి తీసుకురావడం ప్రభుత్వ సామాజిక నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల నిధులు ఒకేసారి కాకుండా విడతల వారీగా జమయ్యే అవకాశం ఉందని, అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సంబంధిత అధికారులను సంప్రదించి అవసరమైన వివరాలు అందజేస్తే తదుపరి విడతల్లో నిధులు అందుతాయని వివరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేపడుతున్న విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నారు అని తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇళ్ల స్థలాల పంపిణీ చేయడం, విద్యార్థుల ఉన్నత విద్య కోసం స్కిట్ కాలేజీ తిరిగి ప్రారంభించడం వంటి కార్యక్రమాలు యువత భవిష్యత్తుకు దోహదపడుతున్నాయని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలు, ఆర్థిక ప్రోత్సాహం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. విద్యపై పెట్టుబడి అంటే రాష్ట్ర భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టినట్టే అని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకుడు భాస్కర్ యాదవ్, పూమణి, అనురాధ, సరళ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home