🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 20 Jul, 2026 | Page: 1

గుంటూరులో మళ్లీ కరోనా అలర్ట్.. జీజీహెచ్‌లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు!

ప్రత్యేక వార్డులు, పరీక్షల కౌంటర్లు ఏర్పాటు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ సూచన

గుంటూరు, జూలై 19:

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో మరో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదుకావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బాపట్ల జిల్లా కర్లపాలెంకు చెందిన వ్యక్తికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో వెంటనే ఆసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డులు సిద్ధం చేసిన అధికారులు, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు. రోగి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికే నలుగురు కోవిడ్ పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా లక్షణాలు ఉన్నవారు లేదా అనుమానం ఉన్న వ్యక్తులు వెంటనే పరీక్షలు చేయించుకునేలా ప్రత్యేక కోవిడ్ పరీక్షల కౌంటర్లను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. అవసరమైన వారికి పరీక్షలు, వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.
🏠 Home