వ్యాధులపై అప్రమత్తతే ఆరోగ్యానికి రక్షణ: డా. చంద్రశేఖర్ నాయక్
వంటిల్లు, జూలై 18 (రాజనీతి): ప్రభుత్వ 104 ఉచిత ఆరోగ్య సేవల్లో భాగంగా వంటిల్లు గ్రామంలో వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యాధికారి డా. చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ జలుబు, దగ్గు, జ్వరం, నీరసం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కు కప్పుకోవడం, అవసరమైతే మాస్క్ ధరించడం వంటి అలవాట్లు వ్యాధుల నివారణకు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ హెచ్‌ఈఓ కొండయ్య, ఏఎన్‌ఎం వసుంధర, సీహెచ్‌వో నాగముత్యం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.