🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 17 Jul, 2026 | Page: 1

ప్రజల గోడు విన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. వెంటనే చర్యలకు అధికారులకు ఆదేశాలు....

ప్రజాదర్బార్‌లో వినతుల జల్లు.. సమస్యల పరిష్కారానికి గురజాల దిశానిర్దేశం...

అర్జీ ఇచ్చిన వెంటనే స్పందన.. ప్రజా సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష...

చిత్తూరు (జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని ప్రాధాన్యంగా తీసుకుని సకాలంలో పరిష్కరించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (ప్రజాదర్బార్) కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. ఒక్కో అర్జీదారుతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి కొరత, సిమెంట్ రోడ్ల నిర్మాణం, మురుగునీటి కాలువలు, వీధి దీపాలు, రెవెన్యూ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన వినతులను పరిశీలించి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రతి శాఖ అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి వినతిని నమోదు చేసి, వాటి పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించకుండా ఆర్టీసీ యాజమాన్యమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందేలా ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సంబంధిత స్థాయిలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.వివిధ కాలనీలకు చెందిన ప్రజలు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్, ఇతర అభివృద్ధి పనులపై వినతులు అందజేశారు. పలు సంఘాల ప్రతినిధులు కూడా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని పరిశీలించి అర్హమైన వాటిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, పరిశీలకులు పురిమిట్ల కుమారి, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాదర్బార్‌లో తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు వివరించి వెంటనే స్పందన లభించడంతో అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
🏠 Home