డొనేషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న హెచ్ఎం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ...విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల పై కేసు నమోదు చేయాలి
మదనపల్లి, జూలై 13 (రాజనీతి): అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) జారీ విషయంలో డొనేషన్ పేరుతో డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ సంబంధిత ప్రధానోపాధ్యాయురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఓ దళిత విద్యార్థి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు బాధిత విద్యార్థి నాగార్జున, అతని తల్లి ఆదిలక్ష్మి, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థి నాగార్జున, అతని తల్లి ఆదిలక్ష్మి, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గండికోట వెంకటేష్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్, మదనపల్లి భాగ్ కన్వీనర్ సాయి ప్రకాష్ రెడ్డి, పీలేరు టౌన్ కార్యదర్శి సన్నా మనోజ్ మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు. వారి కథనం ప్రకారం, పీలేరు ప్రాంతానికి చెందిన నాగార్జున ఆర్థికంగా వెనుకబడిన దళిత కుటుంబానికి చెందిన విద్యార్థి. అతడు కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉండి అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. తదుపరి చదువుల కోసం టీసీ తీసుకోవడానికి పాఠశాలకు వెళ్లగా, ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి డొనేషన్ చెల్లిస్తేనే టీసీ ఇస్తానని చెప్పినట్లు ఆరోపించారు. దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులు మండల విద్యాశాఖ అధికారి రెడ్డి బాషాను కలిసి తమ ఆర్థిక పరిస్థితిని వివరించి, డబ్బులు లేకుండా టీసీ ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. అయితే, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంపై ప్రధానోపాధ్యాయురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి, అతని తల్లితో వాగ్వాదానికి దిగారని, అనంతరం రూ.1,000 తీసుకున్న తర్వాతే టీసీ ఇచ్చినట్లు ఆరోపించారు. ఇంతటితో ఆగకుండా, తమపై ఫిర్యాదు చేశారనే కారణంతో విద్యార్థి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా విద్యార్థి క్యారెక్టర్ సరిగా లేదు, గతంలో ఉపాధ్యాయులు మందలించడంతో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అనే ఆరోపణలు చేస్తూ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సదాశివనాయుడు, వైస్ చైర్మన్ సుభాన్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారని విమర్శించారు. మైనర్ దళిత విద్యార్థి పరువుకు భంగం కలిగించేలా చేసిన ఈ చర్య అత్యంత బాధాకరమని పేర్కొంటూ, సంబంధిత వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, పాఠశాలకు టీసీ కోసం వచ్చే విద్యార్థుల నుంచి డొనేషన్లు వసూలు చేయాలని విద్యా కమిటీ తరఫున తీర్మానం చేసి ప్రధానోపాధ్యాయురాలికి లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చామని విడుదల చేసిన లేఖ కూడా చట్ట విరుద్ధమని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో టీసీ ఇవ్వడానికి డబ్బులు వసూలు చేయడం ఎలాంటి చట్టపరమైన నిబంధనల్లో లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన ప్రధానోపాధ్యాయురాలు, విద్యా కమిటీ సభ్యులు, వారికి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన దళిత మైనర్ విద్యార్థి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే దానికి పూర్తి బాధ్యత ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల విద్యా కమిటీదేనని హెచ్చరించారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కడప ప్రాంతీయ విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు (ఆర్జేడీ), రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఏబీవీపీతో పాటు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అన్నమయ్య జిల్లా సీనియర్ నాయకులు గండికోట వెంకటేష్, ముల్లంగి రెడ్డప్ప, అమరాల వెంకటరమణ, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్, మదనపల్లి భాగ్ కన్వీనర్ సాయి ప్రకాష్ రెడ్డి, పీలేరు టౌన్ కార్యదర్శి సన్నా మనోజ్, రామసముద్రం ఎంఈఎఫ్ నాయకుడు కొండప్ప, రాచపల్లి వెంకటరమణ, సంగీతం రవి ఈశ్వర్, వాల్మీకిపురం మండల అధ్యక్షుడు గంత బాలకృష్ణ, కలకడ మండల అధ్యక్షుడు వంగిమల్ల హరినాథ్, ఏబీవీపీ నాయకులు నాని, యశ్వంత్, అస్విత్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు.