మాదిగల భూ సమస్యలు, ఇంటి స్థలాల మంజూరుపై ఆర్డీవోకు వినతి
పీలేరు, జూలై 13 (రాజనీతి): పీలేరు మండలంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, ఇంటి స్థలాల కొరత, స్మశాన వాటికల లేమి వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎండీపీఎస్ నాయకులు సోమవారం అన్నమయ్య జిల్లా పీలేరు రెవెన్యూ డివిజనల్ అధికారి ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎండీపీఎస్ నాయకులు ఆర్డీవోతో మాట్లాడుతూ పీలేరు మండలంలోని అనేక గ్రామాల్లో మాదిగ కుటుంబాలు తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు రికార్డులు ఉన్నప్పటికీ, కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి వాటిని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టి, నిజమైన హక్కుదారులకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా ఇప్పటికీ కొన్ని ఎస్సీ, ఎస్టీ గ్రామాలకు ప్రత్యేక స్మశాన వాటికలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి గ్రామానికి తగిన స్థలాన్ని కేటాయించి స్మశాన వాటికల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నివసించడానికి సొంత ఇంటి స్థలం కూడా లేని అనేక నిరుపేద దళిత కుటుంబాలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయని పేర్కొంటూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలాలు మంజూరు చేసి, గృహ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ భూములు పలు ప్రాంతాల్లో అక్రమాలకు గురవుతున్నాయని, అలాంటి భూములను పరిరక్షించి ప్రభుత్వ అవసరాలు, పేదల గృహ స్థలాల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. వినతిని స్వీకరించిన ఆర్డీవో సమస్యలను పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీపీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి పురుషోత్తం, నాయకులు రవి, పీలేరు మండల అధ్యక్షుడు రామానుజులు, గౌరవ అధ్యక్షుడు గుర్రప్ప, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సద్దుల రామచంద్రయ్యతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.