జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఐలు
మదనపల్లి, జూలై 13 (రాజనీతి): అన్నమయ్య జిల్లా పోలీసు శాఖలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు సోమవారం మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఇటీవల రాయచోటి ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఏ. చాంద్ బాషా, జిల్లా సైబర్ క్రైమ్ అండ్ సోషల్ మీడియా సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎన్. శేఖర్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో వారు జిల్లా ఎస్పీని కలిసి తమ విధుల నిర్వహణపై మార్గదర్శకాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన అధికారులు సంప్రదాయ పుష్పగుచ్ఛాలకు బదులుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పూల మొక్కలను ఎస్పీకి అందజేశారు. ఈ చర్యను ఎస్పీ అభినందిస్తూ, పర్యావరణ హిత కార్యక్రమాలకు పోలీసు అధికారులు ప్రాధాన్యత ఇవ్వడం సమాజానికి మంచి సందేశమని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ రూపొందించి, ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ సీఐ ఏ. చాంద్ బాషాకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా సైబర్ క్రైమ్ అండ్ సోషల్ మీడియా సీఐ ఎన్. శేఖర్‌కు సైబర్ నేరాల నియంత్రణతో పాటు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న అసత్య ప్రచారం, ఫేక్ న్యూస్, ప్రజలను తప్పుదోవ పట్టించే పోస్టులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ, బాధితులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాస్నేహ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని, బాధ్యతాయుతంగా, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని ఎస్పీ సూచించారు. ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ప్రతి పోలీసు అధికారికి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ నేరాల నియంత్రణలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.