చెక్–క్లీన్–క్లోజ్ విధానంతో దోమల నివారణ సాధ్యం
మదనపల్లి, జూలై 13 (రాజనీతి): డెంగీ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, వారు పాఠశాలలో నేర్చుకున్న ఆరోగ్య సందేశాలను తమ కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి చేరవేస్తే సమాజంలో విస్తృత స్థాయిలో చైతన్యం ఏర్పడుతుందని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న డెంగీ వ్యతిరేక మాసోత్సవాలలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు మదనపల్లి అర్బన్ పరిధిలోని వివేకానంద మున్సిపల్ హైస్కూల్, బాపూజీ మున్సిపల్ హైస్కూల్ల్లో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డెంగీతో పాటు దోమల ద్వారా వ్యాపించే ఇతర వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ప్రతి శుక్రవారం పాటించాల్సిన డ్రై డే ప్రాముఖ్యతపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ రఫీ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్య రాయబారులుగా మారి తమ ఇళ్లలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దోమల నియంత్రణపై అవగాహన కల్పిస్తే వ్యాధుల నివారణ మరింత సులభమవుతుందని చెప్పారు. చిన్నారుల ద్వారా కుటుంబాలకు, అక్కడి నుంచి సమాజానికి ఆరోగ్య సందేశాలు చేరుతాయని, అందుకే పాఠశాలలలో అవగాహన కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్‌గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధుల లక్షణాలైన అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, వికారం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, నీరసం, శరీరంపై దద్దుర్లు, కంటి వెనుక భాగంలో నొప్పి, రక్త కణాల సంఖ్య తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సకాలంలో వైద్యం తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని వివరించారు. ఈ ఏడాది దోమల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా చెక్ – క్లీన్ – క్లోజ్ అనే మూడు ముఖ్యమైన చర్యలను ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాటించాలని మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. చెక్ : ఇంటి పరిసరాల్లో, కుండీలు, డ్రమ్‌లు, కూలర్లు, కొబ్బరి చిప్పలు, టైర్లు, పూల కుండీలు వంటి నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమల లార్వా ఉందో లేదో తరచూ పరిశీలించాలి. క్లీన్: నిల్వ నీటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. చెత్త పేరుకుపోకుండా చూడాలి. కాలువల్లో చెత్త వేయకూడదు.
క్లోజ్ : తాగునీటి డ్రమ్‌లు, ట్యాంకులు, బిందెలు, ఇతర నీటి నిల్వ పాత్రలకు తప్పనిసరిగా మూతలు పెట్టాలి. ప్రతి శుక్రవారం ఇంట్లో నిల్వ ఉన్న నీటిని పూర్తిగా ఖాళీ చేసి పాత్రలను శుభ్రం చేయాలని, దోమలు గుడ్లు పెట్టే అవకాశం లేకుండా చూడాలని సూచించారు. వారానికి ఒకరోజు 'డ్రై డే' పాటించడం ద్వారా డెంగీ దోమల వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా గ్రామానికి దూరంగా పారవేయాలి. పందులను నివాస ప్రాంతాలకు కనీసం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంచాలి. దోమతెరలు ఉపయోగించాలి. కిటికీలు, వెంటిలేటర్లకు మెష్ అమర్చుకోవాలి. సాయంత్రం సమయంలో వేపాకులతో పొగ వేయడం, ఇంట్లో లైట్లు వెలిగించే సమయంలో తలుపులు, కిటికీలు మూసివేయడం ద్వారా దోమల ప్రవేశాన్ని తగ్గించవచ్చని వివరించారు. గర్భిణులు, బాలింతలు, పదేళ్లలోపు చిన్నారులు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ వర్గాలకు చెందిన వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారికి దోమల కాటు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా దోమల నిర్మూలన సాధ్యం కాదని పేర్కొంటూ, ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్య శాఖకు సహకరించాలని కోరారు. అనంతరం అధికారులు ప్లకార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించి, కరపత్రాలను ఆవిష్కరించి విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని దోమల నియంత్రణపై వారి అవగాహనను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, హెల్త్ అసిస్టెంట్లు కిరణ్, సురేంద్ర, ఏఎన్‌ఎంలు లీలావతి, సంధ్యారాణి, ఆశా కార్యకర్తలు నాగమల్లేశ్వరి, కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.