🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 10 Jul, 2026 | Page: 1

చిత్తూరుకు పరిశ్రమల హబ్‌గా మారే అవకాశం..

యువతకు స్థానికంగానే ఉద్యోగాలు: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్...

హైవే కనెక్టివిటీతో చిత్తూరులో కంపెనీల వెల్లువ.. జాబ్ మేళాలో ఎమ్మెల్యే ఆశాభావం...

చెన్నై–బెంగళూరు కారిడార్‌లో చిత్తూరుకు పరిశ్రమలు తీసుకొస్తాం: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్...

జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే...

యువత ఉపాధే లక్ష్యం.. చిత్తూరులో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి: ఎమ్మెల్యే...




చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు జిల్లా నలువైపులా జాతీయ రహదారుల అనుసంధానం మెరుగుపడడంతో భవిష్యత్తులో అనేక పరిశ్రమలు, ప్రముఖ కంపెనీలు జిల్లాలో అడుగుపెడతాయని, తద్వారా స్థానిక యువతకు స్వగ్రామంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం, అడెక్కో సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరులోని ఎమ్మెల్యే కార్యాలయం ప్రజాదర్బార్‌లో నిర్వహించిన జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని యువత నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలతో పాటు ఉద్యోగ కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల యువత ఇతర నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారి ప్రయత్నాల ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని చిత్తూరు జిల్లా కూడా ఈ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు అనుసంధానంగా ఉన్న చిత్తూరు భౌగోళికంగా ఎంతో అనుకూల ప్రాంతమని ఎమ్మెల్యే వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. చిత్తూరులో పరిశ్రమలు స్థాపిస్తే స్థానిక యువతకు అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు జిల్లా ఆర్థికాభివృద్ధి కూడా వేగవంతమవుతుందని పేర్కొన్నారు.జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులతో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్వయంగా మాట్లాడి వారి విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగాలపై ఆసక్తి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగాల కోసం యువత చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ, నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఉద్యోగ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో నిబద్ధతతో పనిచేసి సంస్థలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యోగ మేళాలను నిర్వహించి జిల్లాలోని నిరుద్యోగ యువతకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి పద్మజ, అడెక్కో సంస్థ ప్రతినిధులు, ఉద్యోగార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ మేళాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరై ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు యువత భవిష్యత్తుకు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.
🏠 Home