🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 09 Jul, 2026 | Page: 1

జాతీయ స్థాయి SOF ఒలింపియాడ్‌లో ఖాన్స్ రైన్‌బో ఈ-స్మార్ట్ స్కూల్ విద్యార్థుల సత్తా

రేణిగుంట, జూలై 9 (రాజనీతి): దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ (ఎస్ఓఎఫ్) నిర్వహించిన జాతీయ స్థాయి ఒలింపియాడ్ పరీక్షల్లో ఖాన్స్ రైన్‌బో ఈ-స్మార్ట్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మరోసారి పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. జోనల్ స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధిస్తూ పలు విభాగాల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్, నగదు బహుమతులు, గిఫ్ట్ వౌచర్లు, మెరిట్ సర్టిఫికెట్లు అందుకొని తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా నిర్వహించే ఎస్ఓఎఫ్ ఒలింపియాడ్ పరీక్షలు విద్యార్థుల్లో సైన్స్, గణితం, ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ వంటి సబ్జెక్టులపై అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడుతున్నాయి. దేశంలోని వేలాది పాఠశాలలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకుంటారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ, జోనల్ స్థాయిల్లో ర్యాంకులు, పతకాలు, నగదు బహుమతులు, గిఫ్ట్ వౌచర్లు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఖాన్స్ రైన్‌బో ఈ-స్మార్ట్ స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పాఠశాల ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి చేర్చారు. పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న బి. నైనేశ్వర్ నాయుడు ఇంటర్నేషనల్ కంప్యూటర్ సైన్స్ ఒలింపియాడ్ (ఐసిఎస్ఓ) పరీక్షలో అద్భుత ప్రతిభ కనబర్చి జోనల్ ప్రథమ ర్యాంక్ సాధించాడు. ఈ ఘన విజయానికి గుర్తింపుగా అతనికి గోల్డ్ మెడల్‌తో పాటు రూ.5,000 నగదు బహుమతి అందజేయబడింది. జాతీయ స్థాయి పోటీలో సాధించిన ఈ విజయం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. అలాగే 3వ తరగతి విద్యార్థి పి. శక్తి శరవణ సాయి రెండు విభిన్న ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ (ఐఈఓ)లో జోనల్ ప్రథమ ర్యాంక్ సాధించి గోల్డ్ మెడల్, రూ.1,000 విలువైన గిఫ్ట్ వౌచర్ అందుకున్నాడు. అదేవిధంగా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ (ఐఎంఓ)లో జోనల్ ద్వితీయ ర్యాంక్ సాధించి సిల్వర్ మెడల్, రూ.1,000 గిఫ్ట్ వౌచర్ కైవసం చేసుకున్నాడు. ఒకే విద్యార్థి రెండు విభిన్న అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం విశేషంగా నిలిచింది. ఈ పరీక్షల్లో మరో నలుగురు విద్యార్థులు కూడా జోనల్ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఎస్. ఆలియా హబీబా (9వ తరగతి), పి. మోక్షిత్ (5వ తరగతి), జి. గిర్జేష్ (4వ తరగతి), వి. నిహాల్ (3వ తరగతి) వీరు జోనల్ ఎక్సలెన్స్ సర్టిఫికెట్లు, మెరిట్ సర్టిఫికెట్లు అందుకోవడంతో పాటు ఒక్కొక్కరు రూ.500 విలువైన గిఫ్ట్ సర్టిఫికెట్లను పొందారు. విద్యార్థుల ఈ విజయాలపై పాఠశాల చైర్మన్ పి. అత్తావుల్లా ఖాన్ హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ర్యాంకులు సాధించడం చిన్న విషయం కాదని, విద్యార్థుల నిరంతర కృషి, ఉపాధ్యాయుల నాణ్యమైన బోధన, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఖాన్స్ రైన్‌బో ఈ-స్మార్ట్ స్కూల్‌లో విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా పాఠశాల నిరంతరం కృషి చేస్తోందన్నారు. విజేత విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేసి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పాఠశాలకు, తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
🏠 Home