🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 08 Jul, 2026 | Page: 1

నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు

రేణిగుంట, జూలై 8 (రాజనీతి):
గతంలో చైన్ స్నాచింగ్ కేసులో జైలుకు వెళ్లి ఇటీవల విడుదలైన ఇద్దరు యువకులు, తమ అరెస్టుకు పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కక్షతో ఓ వ్యక్తిపై దాడి చేసి బెదిరించిన ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసులో నిందితులుగా ఉన్న కొందరు ఇటీవల జైలు నుంచి విడుదలై తిరిగి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కేసులో తమ అరెస్టుకు కారణమైన వ్యక్తిపై కక్ష పెంచుకుని దాడికి దిగిన ఘటనపై రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. 2025 నవంబర్ 18న అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉపాధ్యాయనగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటనలో చైన్ స్నాచింగ్ కేసు నమోదైంది. ఆ కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో, తారకరామనగర్‌కు చెందిన దిలీప్ అనే వ్యక్తి నిందితుల వివరాలను పోలీసులకు అందించాడని తెలిపారు. ఆ సమాచారంతో నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారని చెప్పారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నిందితులు తమ అరెస్టుకు కారణం దిలీప్‌నేనని భావించి అతనిపై తీవ్ర కక్ష పెంచుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల దిలీప్ ఇంటి వద్దకు వెళ్లి, నీ వల్లే మేము పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాం అంటూ అతనిపై దాడి చేసి, బెదిరించి, అతని వద్ద ఉన్న నగదును బలవంతంగా లాక్కొన్నట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్టు చేసిన నిందితులు వెంకటగిరి వివేక్ మరియు ఆవుల లక్ష్మణ్ కుమార్ @ అఖిల్ అని, వీరిద్దరూ రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామనగర్‌కు చెందిన వారని వెల్లడించారు. వీరిద్దరిపై ఇప్పటికే అలిపిరి చైన్ స్నాచింగ్ కేసు నమోదై ఉండగా, ప్రస్తుతం నమోదైన ఈ కేసు రెండో కేసు అని తెలిపారు. నేరప్రవృత్తిని కొనసాగిస్తున్న వీరిపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు రౌడీ షీట్లు తెరవనున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. అలాగే కోర్టు నుంచి విడుదలైన అనంతరం వీరిని సంబంధిత ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి మంచి ప్రవర్తనకు సంబంధించిన బాండ్లు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ బాండ్లలో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘిస్తే వారు సమర్పించిన బాండ్ మొత్తాన్ని వసూలు చేయడమే కాకుండా, చట్టప్రకారం మళ్లీ రిమాండ్‌కు పంపించే చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను బుధవారం న్యాయస్థానం ఎదుట హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ ఘటనలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవకు సంబంధించి మరో కేసు కూడా నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఆ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, దర్యాప్తు పూర్తయిన తర్వాత అందులో ప్రమేయం ఉన్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు.
🏠 Home