🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 07 Jul, 2026 | Page: 1

జీవితాంతం ఎడారిలో గడిపి.. చివరకు అక్కడే.. తెలంగాణ వాసి దీనగాథ

పేదరికం నుంచి బయటపడటానికి పెళ్లయిన సంవత్సరానికే ఎడారి బాట పట్టిన ఒక తెలంగాణ వ్యక్తి ఒక్కసారి కూడా వెనక్కి రాకుండా అరబ్బు దేశంలో ఏకధాటిగా 44 ఏళ్ళు గడిపాడు. చివరకు అక్కడే కన్నుమూశాడు.
44 ఏళ్ళలో ఒక్కసారి కూడా మాతృభూమికి రాలేని వైనం
మరణం తరువాత తానో భారతీయుడినని నిరూపించుకొన్న పేద ప్రవాసీ

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చల్లాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య.. దళితులకు వంశపార్యంగా సంక్రమిస్తున్న పేదరికం నుంచి బయటపడడానికి 44 ఏళ్ళ క్రితం ఎడారి బాట పట్టాడు. 1982లో సౌదీ అరేబియాకు వెళ్లి, ఆ తరువాత ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి రాలేదు. అప్పటికే అదే గ్రామానికి చెందిన లక్ష్మితో పెళ్లైన ఎడాదిలోపు గల్ఫ్ విమానమెక్కిన చంద్రయ్య మరెప్పుడూ స్వదేశానికి రాలేదు. ఇప్పుడు కార్గో విమానంలోని శవపేటికలో తిరుగు ప్రయాణమయ్యాడు.
ఇడుపు కాగితం కాదని మనువాడిన వాడు కన్నతల్లి, మాతృభూమికి దూరంగా దశాబ్దాలుగా బయట ఉన్నా ఒక ఆదర్శ జీవిత భాగస్వామిగా తన పవిత్ర ధర్మాన్ని పాటించింది. 44 ఏళ్లుగా భర్త కోసం ఎదురు చూసింది. 20 సంవత్సరాల క్రితం తన గ్రామానికి చెందిన మోండయ్య సౌదీలో తన భర్తను కలిసాడని తెలుసుకోని సంతోషించింది. ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని ఆశపడిన ఆమెకు నిరాశే మిగిలింది. అత్తమామలు అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు లక్ష్మి విధేయత కల్గిన కోడలిగా కాకుండా కన్నబిడ్డలా వారికి సేవలందించింది.
నాలుగు దశాబ్దాలుగా గల్ఫ్‌లో ఉన్న తనకు ఒక్క రూపాయి కూడా ఎప్పుడు పంపించలేదని లక్ష్మి ‘ఆంధ్రజ్యోతి’తో వాపోయింది. తన అత్తమామలను తన తల్లిదండ్రులుగా భావించానని చెప్పింది. ఈ నాలుగు దశాబ్దాలలో తరం మారింది. ఉత్తరాల స్థానంలో ట్రంక్ కాల్ వచ్చి ఆ తర్వాత డిజిటిల్ యుగం ప్రవేశించింది. చంద్రయ్య మాతృభూమికి వెళ్లకపోవడంతో ఎన్నికల సంఘం ఫోటో గుర్తింపు కార్డు లేదు, అలాగని ఆధార్ కార్డు కూడా లేదు. పాస్‌పోర్టు మినహా మరే ఇతర గుర్తింపు అతని వద్ద లేదు.
తాను పని చేస్తున్న సంస్థలో వివాదం ఏర్పడి అందులో చిక్కుకొన్నాడు, ఆధార్ లేకపోవడంతో పాస్‌పోర్టు రెన్యూవల్ కాలేదు. పాస్ పోర్టు గడువు పూర్తైనందుకు సౌదీ అఖమా రెన్యూవల్ కాలేదు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు, ఉపాధి ఆరాటం కారణాలతో సుదీర్ఘ సంవత్సరాల పాటు కూలీనాలీ పని చేసుకుంటూ గడిపిన చంద్రయ్య వీసా, పాస్ పోర్టు గడువు ముగిసి ఏళ్లు గడిచిపోయాయి. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో మే నెలలో మరణించాడు.
వారాలు గడుస్తున్నా ఈ శవం గురించి ఎవరూ కూడా విచారించకపోవడంతో ఆసుపత్రి వర్గాలు, పోలీసులు చంద్రయ్య వీసా ఆధారంగా అతను భారతీయుడని గుర్తించి ప్రముఖ సామాజిక కార్యకర్త నాజ్ శౌకత్‌కు సమాచారమందించారు. అతను భారతీయ ఎంబసీ, సాటా సెంట్రల్ సామాజిక కార్యకర్త ఫారూఖ్‌ల సహాయంతో మృతుడి కుటుంబ వివరాలను తెలుసుకొని వారిని సంప్రందించారు. ఒక రెండు రోజుల్లో మృతదేహాన్ని పంపించడానికి భారతీయ ఎంబసీ ప్రయత్నిస్తోంది.
ఉజ్వల భవిష్యత్తు కోటి ఆశలతో బయలుదేరి చివరకు అంధకారంలోని అధఃపాతళంలో ఇరుక్కుపోయి మౌనంగా సమిధులవుతున్న బతుకులకు చంద్రయ్య ఒక ఉదాహరణ.
🏠 Home