మామిడి రైతులకు కేంద్ర సాయం.. బీజేపీ నేతల పాలాభిషేకం
తోతాపురి మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయానికి కృతజ్ఞతగా చిత్తూరులో శనివారం బీజేపీ నాయకులు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో రైతులు కొనుగోలుదారుల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తోతాపురి మామిడి రైతుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయగా, రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.4 ప్రోత్సాహకం ప్రకటించిందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రెండు లక్షల 16 వేల టన్నుల తోతాపురి మామిడికి కిలోకు రూ.2.18 చొప్పున సాయం ప్రకటించిందని తెలిపారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి త్వరలో అధ్యయనం చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, రాష్ట్ర పదాధికారి చిట్టిబాబు కొల్లా, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకటేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుజిత్ రెడ్డి, మోహన్ నాయుడు, అరుణమ్మ, రాజేంద్రన్, చంద్రమోహన్, భాను ప్రకాష్, బ్రహ్మానంద రెడ్డి, రామభద్ర, షణ్ముగం, లితీష్, పరదేశి, రెడ్డి మస్తాన్, సురేష్ కుమార్, హేమంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.