🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 03 Jul, 2026 | Page: 1

రాయలసీమ కల సాకారం.. కడపలో ఉక్కు పరిశ్రమకు శ్రీకారం

రాయలసీమ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కడప ఉక్కు పరిశ్రమ కల సాకారమయ్యే దిశగా కీలక అడుగులు పడుతున్నాయని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కడప జిల్లా జమ్మలమడుగులో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టడం రాయలసీమ అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ హయాంలో కడప స్టీల్ ప్లాంట్ పేరుతో ప్రజలకు పలుమార్లు హామీలు ఇచ్చి శంకుస్థాపనలు చేసినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. మూడు సార్లు శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభించకపోవడం ద్వారా ప్రజల ఆశలను వమ్ము చేశారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ భాగస్వామ్యంతో స్టీల్ ప్లాంట్ పనులకు పునఃప్రారంభం కావడం రాయలసీమ ప్రజలకు శుభపరిణామమని చెప్పారు. పరిశ్రమ ఏర్పాటు కోసం అవసరమైన మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రభుత్వం సిద్ధం చేసిందని ఎమ్మెల్యే వివరించారు. నీటి కేటాయింపులు నాలుగు లైన్ల యాక్సెస్ రోడ్లు రైల్వే అనుసంధానం విద్యుత్ సబ్‌స్టేషన్లు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇతర వసతులు కల్పించినట్లు తెలిపారు. దీంతో పరిశ్రమ నిర్మాణ పనులు మరింత వేగవంతమయ్యే అవకాశముందని పేర్కొన్నారు.ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ఉక్కు పరిశ్రమ చుట్టూ అనేక అనుబంధ పరిశ్రమలు ఏర్పడి రాయలసీమలో పారిశ్రామికీకరణకు కొత్త ఊపు వస్తుందని స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ రాయలసీమ ఆర్థికాభివృద్ధికి కీలక మలుపు కానుందని పేర్కొన్న ఆయన ఈ ప్రాజెక్టు వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు రవాణా వ్యాపారం సేవారంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని వివరించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు ఏర్పడి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు.గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే, కడప ఉక్కు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ కోసం కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించకుండా అక్రమాలకు పాల్పడ్డారని దీంతో రాయలసీమ ప్రజల కల మరింత ఆలస్యమైందని అన్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మాత్రం రాయలసీమ అభివృద్ధికి నాంది పలుకుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు.జేఎస్‌డబ్ల్యూ సంస్థతో కలిసి స్టీల్ ప్లాంట్ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునఃప్రారంభం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఇది రాయలసీమ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమ కల నిజమవుతుండటంతో రాయలసీమ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంత సమగ్రాభివృద్ధికి బాటలు పడతాయని ఆయన పేర్కొన్నారు.
🏠 Home