🏠 rajaneethi.in
Watermark
Newspaper Logo
rajaneethi.in | Date: 29 Jun, 2026 | Page: 1

ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు – సీఐ జయచంద్ర

ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను ముందుగానే అరికట్టడం లక్ష్యంగా రేణిగుంట పట్టణంలో ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఎస్పి సుబ్బారాయుడు ఆదేశాల మేరకు,డిఎస్పి శ్రీనివాసరావు సూచనలతో సోమవారం సీఐ జయచంద్ర, ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పట్టణంలోని సాయిబాబా వీధి, పోస్టాఫీస్ వీధి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంగణం, రద్దీ వ్యాపార ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు తదితర ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పోలీసులు కాలినడకన ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ పోలీసు శాఖ ప్రజల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తోందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తే నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. పట్టణంలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నా, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నా, ఇతర అసాంఘిక కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి తగిన రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పట్టణంలో ఆకతాయిల వేధింపులు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తిస్తున్నామని, అలాంటి ప్రాంతాల్లో పోలీసు నిఘాను మరింత పెంచి ఫుట్ పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు, రాత్రి గస్తీని మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు, వృద్ధులు భయాందోళనలకు గురికాకుండా భద్రతా చర్యలు చేపడుతున్నామని వివరించారు. యువతలో పెరుగుతున్న గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సీఐ జయచంద్ర, అలాంటి వ్యసనాలు యువత భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తాయని హెచ్చరించారు. మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత చదువు, ఉపాధి, క్రీడలు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ఫుట్ పెట్రోలింగ్ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల అమలుపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి సంబంధిత వాహనదారులకు జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలకు కూడా కారణమవుతుందని పోలీసులు వివరించారు. అదేవిధంగా త్రిబుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడిన వాహనదారులను నిలిపివేసి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని వివరించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల చిన్న ప్రమాదాలు కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమాలను పట్టణంలో నిరంతరం నిర్వహిస్తామని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సీఐ జయచంద్ర తెలిపారు. ప్రజలు పోలీసులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు నేరాల నివారణ, ట్రాఫిక్ నియమాల అమలు, మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు, వ్యాపారులు పాల్గొన్నారు.
🏠 Home