అక్రమ ఇసుక రవాణాపై పోలీసు దాడులు జేసీబీతో పాటు 14 ట్రాక్టర్లు స్వాధీనం
అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై తిరుపతి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. రేణిగుంట మండలం, గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా విస్తృత స్థాయిలో ఆకస్మిక దాడులు నిర్వహించి భారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ మంజునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గాజులమండ్యం ఎస్‌ఐ హరీష, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారుల బృందాలు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. అక్రమ ఇసుక తవ్వకం, నిల్వ, రవాణాపై ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కొట్రమంగళం గ్రామ పరిధిలోని మునెమ్మకు చెందిన ప్రైవేటు స్థలంలో అక్రమంగా ఇసుక నిల్వ చేసి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఇసుకను తరలించేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 10 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పిల్లపాలెం సమీపంలో మరో బృందం నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న ఒక జేసీబీ, నాలుగు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశారు. మొత్తంగా ఈ సంయుక్త దాడుల్లో ఒక జేసీబీతో పాటు 14 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా సీఐ మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రభుత్వ సహజ వనరులను అక్రమంగా దోచుకునే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ తరచూ సంయుక్త దాడులు నిర్వహిస్తామని, అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లు, జేసీబీకి సంబంధించిన యజమానులు, అక్రమ ఇసుక తవ్వకం, రవాణాలో పాల్గొన్న వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ప్రజలు కూడా అక్రమ ఇసుక తవ్వకం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ మంజునాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రజలు కూడా అక్రమ ఇసుక తవ్వకం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ మంజునాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.