మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సిడబ్ల్యూఎం బి. ఆనంద్
తిరుపతి క్యారేజ్ రిపేర్ షాప్ (సీఆర్ఎస్) చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ బి.ఆనంద్ మానవత్వానికి ప్రతీకగా నిలిచే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైల్వే సేవలో ఉండగానే మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు, తోటి ఉద్యోగుల సహకారంతో నిధులు సమీకరించి వారి కుటుంబాలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఆర్ఎస్ చరిత్రలో తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమం ఉద్యోగుల్లో సేవాభావాన్ని, పరస్పర సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేసింది. బుధవారం సీఆర్ఎస్ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన ముగ్గురు రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందజేశారు. తోటి ఉద్యోగులు స్వచ్ఛందంగా అందించిన విరాళాలను సమీకరించి ఈ సహాయాన్ని అందించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిడబ్ల్యూఎం బి. ఆనంద్ మాట్లాడుతూ ఉద్యోగుల కుటుంబాలు కష్టకాలంలో ఒంటరిగా మిగిలిపోకుండా వారికి అండగా నిలబడటం ప్రతి సహోద్యోగి బాధ్యత అని అన్నారు. సీఆర్ఎస్‌లో ఇలాంటి కార్యక్రమం తొలిసారిగా ప్రారంభం కావడం ఎంతో సంతోషంగా ఉందని, దీనికి సహకరించిన యూనియన్ నాయకులు, కార్మికులు, అధికారులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. పుట్టిన ప్రతి మనిషి మరణం అనివార్యం. అయితే ఆ మరణం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. భద్రతా నియమాలను పాటిస్తూ పనిచేయాలి. మనతో కలిసి పనిచేసిన ఉద్యోగి మరణించినప్పుడు అతని కుటుంబాన్ని మన కుటుంబంగా భావించి ఆదుకోవడం మన సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే మనం చేసే సహాయం పరిమాణం కంటే, సహాయం చేయాలనే మనసు గొప్పదని ఆయన వివరించారు. భారతీయ సంస్కృతిలో దానధర్మాలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, పురాణాల్లో బలి చక్రవర్తి, మహాదాత కర్ణుడు చేసిన సేవలను ఉదాహరణగా చెప్పారు. రామాయణంలో శ్రీరాముడి సేతు నిర్మాణంలో ఉడత చేసిన చిన్న సహాయం కూడా ఎంత విలువైనదో వివరిస్తూ, చిన్న సహాయం కూడా అవసరమైన సమయంలో ఒక కుటుంబానికి పెద్ద బలంగా నిలుస్తుందని అన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రైల్వే శాఖ నుంచి అందాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు, పింఛన్, సెటిల్‌మెంట్ బకాయిలు, బీమా సదుపాయాలు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన ధ్రువపత్రాలు, పత్రాలను కుటుంబ సభ్యులు వెంటనే సమర్పించాలని కోరారు. సంబంధిత అధికారులు వాటిని వేగంగా పరిశీలించి పెండింగ్‌లో ఉన్న ప్రయోజనాలను ఆలస్యం లేకుండా అందించాలని ఆదేశించారు.సీఆర్ఎస్ కుటుంబం అనేది కేవలం ఉద్యోగుల సమూహం కాదని, ఒక కుటుంబం. ఒకరి కష్టం అందరి కష్టం అనే భావనతో ముందుకు సాగుతూ, పరస్పర సహకారం, స్నేహభావం, మానవత్వం అనే విలువలతో రైల్వే అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన సీఆర్ఎస్ యాజమాన్యం, సహోద్యోగులు, యూనియన్ నాయకులకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం తమ కుటుంబాలకు ఎంతో ధైర్యాన్ని, భరోసాను కల్పించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించేందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమం సీఆర్ఎస్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవడంతో పాటు, ఉద్యోగుల మధ్య మానవీయ విలువలను మరింత బలోపేతం చేసిన ఆదర్శ కార్యక్రమంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఈ ప్రమోద్, డబ్ల్యూపిఓ శ్రీనివాస నాయక్, సీఎంటీ ఎస్.కే. కాజా, డబ్ల్యూఎం భానుప్రకాష్, ఎడబ్ల్యూఎం నవీన్ కుమార్, సీఆర్ఎస్ కార్యాలయ సిబ్బంది, అధికారులు, వివిధ సంఘాల నాయకులు, యూనియన్ ప్రతినిధులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.