మిట్స్ యూనివర్సిటీలో స్పేషియల్ కంప్యూటింగ్, వేర్‌బుల్ టెక్నాలజీలపై అతిథి ఉపన్యాసం....
మదనపల్లె సమీపంలోని (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ ఆధ్వర్యంలో “స్పేషియల్ కంప్యూటింగ్ మరియు వేర్‌బుల్ టెక్నాలజీల భవిష్యత్” అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికాలోని బోస్టన్ నగరంలో గల నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీకి చెందిన స్పేషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ గ్రూప్ (SINRG) డైరెక్టర్, ఏంజెల్ ఇన్వెస్టర్ డాక్టర్ మల్లేశం దాసరి హాజరై అధ్యాపకులు, విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం సంప్రదాయ స్క్రీన్ ఆధారిత కంప్యూటింగ్ నుంచి స్పేషియల్ కంప్యూటింగ్ వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. డిజిటల్ ప్రపంచాన్ని భౌతిక ప్రపంచంతో అనుసంధానించే సాంకేతికతలు మానవ-యంత్ర పరస్పర చర్యల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR), మిక్స్డ్ రియాలిటీ (MR), ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (XR), స్పేషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ కంప్యూటింగ్, వైర్‌లెస్ సెన్సింగ్ మరియు వేర్‌బుల్ టెక్నాలజీలలో జరుగుతున్న అభివృద్ధులను ఆయన వివరించారు. ఆపిల్ విజన్ ప్రో వంటి ఆధునిక పరికరాలు, లైడార్ సెన్సార్లు, డెప్త్ సెన్సింగ్ టెక్నాలజీలు, కృత్రిమ మేధస్సుతో కూడిన స్మార్ట్ గ్లాసెస్ ద్వారా వినియోగదారులు మరింత సహజమైన త్రీ-డైమెన్షనల్ అనుభూతిని పొందగలరని తెలిపారు. కంటి కదలికలు, చేతి సంకేతాలు, వాయిస్ కమాండ్ల ద్వారా పరికరాలను నియంత్రించే సాంకేతికతలు భవిష్యత్ కంప్యూటింగ్‌కు కొత్త దిశను చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వైద్యం, శస్త్రచికిత్సలు, పరిశ్రమలు, విద్య, జాతీయ భద్రత, వినోదం, గేమింగ్ మరియు అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో ఈ సాంకేతికతల వినియోగం వేగంగా విస్తరిస్తోందని, తద్వారా నూతన ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, అసోసియేట్ డైరెక్టర్ (ఇంటర్నేషనల్ రిలేషన్స్) డాక్టర్ యు. విజయలక్ష్మి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.