ఘనంగా గిరిజనుల ముద్దుబిడ్డ దారు నాయక్‌కు జన్మదిన వేడుకలు
రేణిగుంట మండలం గురవరాజుపల్లి ఎస్టీ కాలనీలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు, మాజీ ట్రైకార్ జిల్లా కార్పొరేషన్ చైర్మన్ ఎం.దారు నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజనుల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందిన దారు నాయక్‌కు స్థానిక గిరిజనులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాసారపు సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న నాయకులు దారు నాయక్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించి, పూలమాలలతో సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సామాజిక సేవా భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాసారపు సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుల్లో దారు నాయక్ ఒకరని కొనియాడారు. 2019 నుంచి 2024 వరకు పార్టీ అధికారంలో లేకున్నా గిరిజనుల సమస్యలపై వెనక్కి తగ్గకుండా పోరాటం చేశారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, అవసరమైతే ఆందోళనలు చేయడం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలబడడం దారు నాయక్ ప్రత్యేకత అని అన్నారు. గిరిజనులు, యానాది కుటుంబాల సమస్యలు పరిష్కారం కావాలంటే నాయకత్వంతో పాటు అవగాహన, విద్య కూడా అవసరమని ఆయన ఎప్పుడూ చెబుతుంటారని తెలిపారు. దారు నాయక్ గిరిజన యువత చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. గిరిజన పిల్లలు చదువుకోవాలి, ఉన్నత విద్యను అందుకోవాలి, ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచనతో ఎప్పుడూ పనిచేస్తారని వివరించారు. హాస్టళ్లు, కళాశాలలు, విద్యా అవకాశాలపై మార్గనిర్దేశం చేస్తూ ఎన్నో కుటుంబాలకు సహకరించారని తెలిపారు. యానాది సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు విద్యే ఆయుధమని ఆయన పదేపదే చెప్పేవారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత లభించిందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా గురవరాజుపల్లి ఎస్టీ కాలనీలో విద్యుత్, రహదారులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గిరిజన సంక్షేమానికి మరింత ప్రాధాన్యత లభిస్తోందని తెలిపారు. జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శనానికి వచ్చిన దారు నాయక్‌ను గురవరాజుపల్లి యానాది కాలనీ ప్రజలు ప్రత్యేకంగా ఆహ్వానించి తమ మధ్యకు తీసుకువచ్చారన్నారు. కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్న తీరును వివరించి స్థానిక ప్రజల ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరగా, దారు నాయక్ సంతోషంగా పాల్గొన్నారని తెలిపారు. ఒక గిరిజన నాయకుడు తమ మధ్యకు వచ్చి సమయం కేటాయించడం ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు. జన్మదిన వేడుకలను కేవలం శుభాకాంక్షల కార్యక్రమంగా కాకుండా సేవా కార్యక్రమాలుగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. మహిళలకు చీరల పంపిణీ, అన్నదానం ద్వారా సామాజిక బాధ్యతను గుర్తు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ ప్రజల మధ్య ఉండి సేవ చేయడమే నిజమైన నాయకత్వమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి, పార్టీ నాయకులు, గిరిజన నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యానాది కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.